రాష్ట్రంలో జాతీయ ప్రాధాన్యత గల వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని ఉపసభాపతి కోన రఘుపతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం కేటాయించాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు మంజూరు చేయలేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. వివిధ పద్దుల కింద రూ.132 కోట్లు మంజూరు చేసి.. వాటిని కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఖాతాలో వేయడం సరికాదన్నారు. ఈ నిధుల నుంచి రాష్ట్ర స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ భవనాల నిర్మాణానికి కేవలం రూ.87 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.
'ఏపీలో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి'
కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏపీలో నెలకొల్పాలని ఉపసభాపతి కోన రఘుపతి కేంద్ర వ్యవసాయశాఖ అధికారులను కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ విశ్వవిద్యాలయం కేటాయించాల్సి ఉన్నా, ఇప్పటికీ మంజూరు చేయలేదన్నారు. కేంద్రం వివిధ పద్దుల కింద ఇచ్చిన నిధులను కేంద్రీయ విశ్వవిద్యాలయం ఖాతాలో వేయడం సరికాదని కోన రఘుపతి అభిప్రాయపడ్డారు.
కేంద్రం కోరితే.. ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులకు తెలిపారు. పూర్తిగా వ్యవసాయ ప్రాధాన్యత ఉన్న రాష్ట్రంలో విభజన చట్టం ప్రకారం రూ.500 కోట్లతో కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సముద్రతీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు అంశంపై వ్యవసాయశాఖ అధికారులతో కోన రఘుపతి చర్చించారు.
ఇదీ చదవండి :దిల్లీ పర్యటనలో పవన్...రేపు నడ్డాతో భేటీ