ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Drones usage in Agriculture: సాగులో సాంకేతికత...రైతు నేస్తాలుగా మారిన డ్రోన్లు... - డ్రోన్లతో పంటలకు పురుగు మందుల పిచికారీ

Drones usage in Agriculture: వ్యవసాయ డ్రోన్లు సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త రెక్కలు విప్పనున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు వీటి వినియోగం ఓ పరిష్కారంగా కనిపిస్తోంది. కొందరు యువకులు అంకుర సంస్థలు ఏర్పాటు చేసి డ్రోన్లను రైతులకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ వెరసి.. పంటచేలల్లో డ్రోన్ల వినియోగం భవిష్యత్తులో ఉపాధి అవకాశాల్ని పెంచనుందని నిపుణుల మాట.

Drones usage in Agriculture
సాగులో సాంకేతికత...రైతు నేస్తాలుగా మారిన డ్రోన్లు...

By

Published : Feb 23, 2022, 4:30 PM IST

Drones usage in Agriculture: వ్యవసాయ డ్రోన్లు సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త రెక్కలు విప్పనున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు వీటి వినియోగం ఓ పరిష్కారం గా కనిపిస్తోంది. కేంద్రం బడ్జెట్లో చేసిన వ్యవసాయ డ్రోన్ల ప్రకటన ఈ రంగంపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇంతకీ డ్రోన్లతో ఉపయోగాలు ఏమిటి. ఎన్ని రకాలుగా వీటిని వినియోగించవచ్చు. ఏ తరహా పంటలకు ఇవి అనుకూలం, డ్రోన్ల విస్తృతికి ఉన్న అడ్డంకులేంటి. ప్రభుత్వాలు ఏంచేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.

సాగులో సాంకేతికత...రైతు నేస్తాలుగా మారిన డ్రోన్లు...

ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తీరు మారుతోంది. కొన్నేళ్ల నుంచి యంత్రాల వాడకం బాగా పెరిగింది. వాటితో పాటు సాంకేతిక పరిజ్ఞానం వాడకం తప్పనిసరిగా మారింది. కూలీల కొరత రైతులకు ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు ఉన్న అవకాశాలపై అందరూ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో దూసుకు వచ్చిందే డ్రోన్ల వినియోగం. మొదట్లో రక్షణ రంగంలో ఉన్న డ్రోన్ల వినియోగం ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించింది. వ్యవసాయంలో డ్రోన్‌ల వాడకంలో జపాన్, చైనా, ముందుండగా ఇటీవల కాలంలో ఇతర దేశాల్లోనూ ఈ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విరివిగా వాడడం మొదలు పెట్టారు.

ఇదీ చదవండి :Shallow land in AP : ఇస్రో సర్వేలో ఆసక్తికర విషయాలు.. రాష్ట్రంలో నిస్సార భూమి ఎంతో తెలుసా..!

Technology usage in Agriculture:ఈ క్రమంలో భారత్‌లోనూ డ్రోన్ల వాడకంపై ప్రయోగాలు జరిగాయి. ప్రధానంగా పంటలకు పురుగుమందుల పిచికారి, ఎరువులు, విత్తనాలు వెదజల్లేందుకు వీటిని వినియోగిస్తున్నా రు. పురుగుమందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలనిస్తోంది. వరిసాగు చేసే రైతులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బురదలో దిగి సాధారణ స్ప్రేయర్లతో మందుల పిచికారీ పెద్ద ప్రయాసే. చాలామంది తేళ్లు, పాముకాట్ల బారిన పడేవారు. అలాగే ఎత్తులో పెరిగే పంటలకు సంబంధించి పిచికారి కష్టమైన పని. మొక్కజొన్నతో పాటు పండ్ల తోటల్లో ఈ సమస్య ఎక్కువగా ఎదురయ్యేది. ఇలాంటి వాటికి డ్రోన్లు పరిష్కారం చూపాయి. డ్రోన్ సాయంతో పైనుంచి పిచికారీ చేయటం సులువైంది.

డ్రోన్ల వాడకంతో సమయం బాగా కలిసొచ్చింది. ఎకరా పొలానికి 5నుంచి 6 నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుంది. మామూలు స్ప్రేయర్లతో గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. పంటకు తెగులు వచ్చినప్పుడు ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూలీలు దొరక్క పిచికారీ అలశ్యమైతే పంట పాడైపోయేది. డ్రోన్లు వచ్చాక ఆ ఇబ్బంది తప్పింది. పురుగుమందులూ ఆదా చేయవచ్చు. గతంలో కంటే 30 నుంచి 40% మేర తగ్గించి స్ప్రే చేసినా మంచి ఫలితాలు వస్తున్నట్లు తేలింది. పురుగు మందులు పిచికారీతో రైతులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా తప్పాయి.

" మాగాణుల్లో, నల్లరేగడి నేలల్లో పురుగుల మందులు చల్లాలంటే దిగబడేవి. ఒక్కోసారి రైతుల ప్రాణాల మీదకు కూడా వచ్చేది. జొన్న, మొక్కజొన్న పైరు పెరిగిన తర్వాత మందులు చల్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది.డ్రోన్ ద్వారా ఈ పనులు చాలా సులువుగా అయిపోతున్నాయి. " - హనుమయ్య, రైతు, గుంటూరు జిల్లా

" జామతోటకు మామూలుగా పిచికారి చేసినపుడు పైదాకా తోటకు పూర్తిగా చేయలేకపోయాం. డ్రోన్లతో కొమ్మ చివరి పూత వరకూ పురుగుల మందు పిచికారి చేయగలుగుతున్నాం."-వెంకట భాస్కరరావు, రైతు, ప.గో. జిల్లా

ఇదీ చదవండి :Illegal Transport of Ration: పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Agriculture Drones: డ్రోన్లు వినియోగంలోకి తెచ్చేందుకు కొందరు ఔత్సాహికులు అంకుర సంస్థలు ఏర్పాటు చేశారు. వీరిలో ఎక్కువగా ఇంజనీరింగ్ చదివిన యువత ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న ఒడిదుడుకుల్ని చూసి ప్రత్యామ్నాయాలు ఆలోచించేవారు డ్రోన్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. మొదట్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. మరికొందరు విడిభాగాలు తెచ్చి ఇక్కడ డ్రోన్ల తయారీ మొదలుపెట్టారు. స్థానిక అవసరాలు గుర్తించి అందుకు తగ్గట్లుగా మార్పులు చేశారు. అలాగే కొన్ని పరికరాల్ని స్థానికంగా సమకూర్చుకున్నారు. బ్యాటరీలతో పాటు ఇంజిన్ తో పనిచేసే డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిని రైతుల పొలాల్లో పురుగుమందులు చల్లటానికి వినియోగిస్తున్నారు. దీనికిగాను ఎకరాకు ఇంతని వసూలు చేస్తున్నారు.

అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన యువతకు ఇదో ఆదాయమార్గంగా మారింది. కొందరు ఎక్కువ డ్రోన్లు కొని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ చదివిన వారికి డ్రోన్ పైలెట్లు, హెల్పర్లుగా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చినట్లయింది. పెద్దరైతులు సొంతగా డ్రోన్లు కొనుగోలు చేసి పొలాల్లో వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రోన్ల వాడకం ఎక్కువగా ఉంది. రాయలసీమ ప్రాంతంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ఒరవడి మొదలైంది. కర్నూలు, కడప జిల్లాల్లో కొందరు డ్రోన్లు అద్దెకు ఇవ్వటం ద్వారా ఆదాయం పొందుతున్నారు.

" దాదాపు 3వేల ఎకరాల వరకూ డ్రోన్లతో పురుగుల మందు పిచికారి చేశాం. దూరాన్ని బట్టి అద్దె వసూలు చేస్తున్నాం. సబ్సిడీ ఇస్తే రైతులకు మరింత తక్కువ అద్దెకు డ్రోన్లను అద్దెకు ఇవ్వగలం. ప్రతీ రైతుకు అందుబాటులో ఉంటుంది. " - నారాయణరెడ్డి, డ్రోన్లు అద్దెకిచ్చే వ్యక్తి, గుంటూరు జిల్లా.

" నిరుద్యోగిగా చాలా బాధపడ్డాను. కాస్త పెట్టుబడి పెట్టి స్వతంగా డ్రోన్లను అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. నేను ఉపాధి పొందటమే కాకుండా..మరో ఇద్దరికి ఉపాధి కల్పించగలిగాను. ఇప్పుడిప్పుడే వ్యవసాయంలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇది మంచి పరిణామం." -పుష్పాకర్ రెడ్డి, డ్రోన్లు అద్దెకిచ్చే వ్యక్తి, కర్నూలు జిల్లా

ఇదీ చదవండి :KIA RECORD: అనంతపురం కియా యూనిట్‌ రికార్డు... రెండున్నరేళ్లలో..

Drones in Agriculture Sector: డ్రోన్ల వినియోగానికి సంబంధించి ఇబ్బందులు లేవా అంటే చాలానే ఉన్నాయి. దేశీయంగా అందుబాటులో లేకపోవటం.. ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి రావటం ప్రధాన సమస్య. డ్రోన్​లో కీలకమైన ఫైట్- టెక్నాలజి మనం ఇంకా సొంతగా తయారు చేసుకోలేదు. బ్యాటరీలు కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. ఇక్కడ కేవలం ట్యాంకర్, రెక్కలు, వాటిని అనుసంధానించే కడ్డీలు, కేబుల్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. పైగా డ్రోన్ల ఖరీదు కూడా ఎక్కువే. ఒక్కొక్కటి 5నుంచి 7లక్షల వరకూ ఖరీదు ఉంటుంది. ముఖ్యమైన భాగాలు స్థానికంగా తయారైతే వీటి ధరలు తగ్గుతాయి. ఇక డ్రోన్ల నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిచికారి చేయాల్సిన పొలాన్ని మ్యాపింగ్ చేయటం ముఖ్యం. తద్వారా ఆ పరిధిలోనే డ్రోన్ పిచికారీ చేస్తుంది.

డ్రోన్ ఎగిరే మార్గంలో చెట్లు, విద్యుత్ తీగలు ఇతర అడ్డంకులు ఉంటాయి. వాటిని తప్పిస్తూ డ్రోన్ ద్వారా పిచికారీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి 2నుంచి 4వారాల శిక్షణ అవసరం. అలాగే బ్యాటరీలు అమర్చుకోవటం, రెక్కలు విరిగితే కొత్తవి తగిలించటం, మందుకు తగ్గట్లుగా నీటిని కలపటం ఇవన్నీ కూడా శిక్షణ తీసుకోవాలి. లేకపోతే నిర్వహణలో సమస్యలు రావటంతో పాటు పంటలు కూడా పాడయ్యే ప్రమాదముంది. బ్యాటరీలు మార్చటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. పెట్రోల్ తో పనిచేసే ఇంజిన్ ఉపయోగించి డ్రోన్లను ఎగురవేయటంపై జరిగిన ప్రయోగాలు సానుకూలంగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ తో 1.5ఎకరాలు స్ప్రే చేయవచ్చు. గ్యాస్ సిలిండర్ల వినియోగించి డ్రోన్లు ఎగరేసే సాంకేతికత కూడా విదేశాల్లో ఉంది. అవన్నీ అందుబాటులోకి వస్తే ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

" మనదేశంలోనే డ్రోన్ల తయారీ యూనిట్లను ప్రారంభించి వెసులబాట్లు కల్పిస్తే, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుంది. అలాగే రైతులకు సబ్సిడీ అందిస్తే సాంకేతికత విస్తరిస్తుంది." -బైట్-విష్ణుమొలకల నాగసుధీర్, విహంగ టెక్నాలజీస్ ఎండి

" బ్యాటరీలతో డ్రోన్లను వినియోగించినపుడు జనరేటర్, ఛార్జర్లతో పాటుగా ఆరేడు బ్యాటరీలు తీసుకు వెళ్లడం ద్వారా నిర్వహణ భారం అవుతంది. వీటన్నిటిని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. డ్రోన్ల వినియోగంలో ముఖ్యంగా కావల్సింది ఫ్లైట్ కంట్రోల్ చేయడం" -బైట్-నరేష్, ఏరో స్పేషియన్ టెక్నాలజీస్, డైరక్టర్, విజయవాడ

పెద్ద కమతాల్లో పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడానికి డ్రోన్లను ఉపయోగించ వచ్చు. అలాగే పంటల పరిస్థితిపై విహంగవీక్షణంలో ఫొటోలు, వీడియోలు తీయవచ్చు. వాటి ఆధారంగా పంటకు ఏమైనా చీడపీడలు ఆశిస్తే వాటి ప్రభావం అంచనావేసి నివారణ చర్యలు చేపట్ట వచ్చు. విత్తనాలు వెదజల్లటంతోనూ డ్రోన్లను ఉపయోగించవచ్చు. పంట దిగుబడినీ అంచనా వేయవచ్చు. ఇంకా ఏయే అంశాల్లో వీటిని ఉపయోగించవచ్చో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి :Sand shortage in Anantapur district : కరవు జిల్లాలో ఇసుక కొరత.. చివరికి కృత్రిమ ఇసుకలోనూ...

ABOUT THE AUTHOR

...view details