అనుకోని పరిస్థితుల్లో పిడుగుపాటుకు గురైన ఓ వ్యక్తికి చచ్చుబడిపోయిన రెండు కాళ్లు, చేతులను వారం రోజుల్లోనే చక్కగా పనిచేయించగలిగారు గుంటూరు వైద్యులు. కొత్తపేటలోని బ్రింద న్యూరో సెంటర్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో న్యూరోసర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. ‘ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన సంగటి వెంకటరెడ్డి(36) ఇటీవల పొలంలో పని చేస్తుండగా కొంతదూరంలో భారీ మెరుపులతో పిడుగు పడింది. దాని ప్రభావంతో వెంకటరెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పాటు కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీన్ని వైద్య పరిభాషలో ‘కెరోనో పెరాలసిస్’ అంటారు. ఇటువంటి కేసును గుర్తించడం మన దేశంలో ఇది రెండోది. బాధితుడికి వెంటనే చికిత్స అందించడం వల్ల చచ్చుబడిన అవయవాలను వైద్యులు యథాస్థితికి తీసుకురాగలిగారు. ప్రస్తుతం వెంకటరెడ్డి పూర్తిగా కోలుకున్నారు. సాధారణంగా ఇటువంటి సమస్యకు చికిత్స లేదనుకుని చాలామంది మంచానికే పరిమితమై జీవితాంతం దుర్భర జీవితం గడుపుతుంటారు’ అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేటి వైద్యరంగంలో అందుబాటులోకి వచ్చిన సమర్థ విధానాలతో తగిన వైద్యం అందిస్తే పూర్తి స్థాయిలో కోలుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ అరుదైన చికిత్స గురించి సమగ్ర వివరాలతో అంతర్జాతీయ జర్నల్‌కు ప్రచురణ కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ చికిత్సలో తనతో పాటు న్యూరాలజిస్ట్ రామకృష్ణ పాల్గొన్నారని తెలిపారు. బాధితుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ పిడుగు ప్రభావం వల్ల వెలువడిన వేడిమికి తన మెడలో ఉన్న వెండి గొలుసు పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. కదలలేని స్థితిలో వచ్చిన తనకు ఈ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ఇచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
పిడుగు ప్రభావంతో చచ్చుబడిన శరీరం.. ప్రాణాపాయం నుంచి తప్పించిన వైద్యులు
Kerono Paralysis: పిడుగు ప్రభావంతో శరీరం చచ్చుబడిపోయిన వ్యక్తిని వైద్యులు ప్రాణాపాయం నుంచి రక్షించారు. అరుదైన ‘కెరోనో పెరాలసిస్’కు చికిత్స అందించారు. దేశంలోనే ఇది రెండో కేసు అని వైద్యులు తెలిపారు. అసలేం జరిగిందంటే..?
కెరోనో పెరాలసిస్