Special Article on Dr. Uma: చదువులమ్మ చెట్టు నీడలో కష్టపడిన వారంతా నేడు ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో వివిధ హోదాలకు చేరుకున్నా..ఎంత ఎత్తుకు ఎదిగినా.. తాము చదువుకున్న విద్యాలయాన్ని వారు మర్చిపోలేదు. తమ విజయానికి బాటలు వేసిన కళాశాల రుణం తీర్చుకునేందుకు ముందుకొచ్చారు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పూర్వవిద్యార్థులు. మాతా, శిశు సంరక్షణ విభాగానికి 86 కోట్ల రూపాయల విరాళాన్నిఅందజేయనున్నారు.
రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి.. వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తుంటారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగురపచకపోవడంతో ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లకు మంచాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా లేబర్, గైనిక్ వార్డుల్లో బాలింతలు, పసికందులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చలించిన అమెరికాలో ఉన్న పూర్వ విద్యార్థులు M.C.H విభాగం నిర్మాణానికి ముందుకు వచ్చారు.
జింకానాకి సహాయంగా కేెంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : పూర్వ విద్యార్థులంతా కలిసి జింకానా పేరిట 30 కోట్లు ఇవ్వనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో 35 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి. 650 పడకలతో M.C.H విభాగ భవన నిర్మాణాన్ని 2019లోనే చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నిర్మించనుండగా.. ఆ తర్వాత 2 నుంచి 5 అంతస్తుల పనులు జింకానా చేపట్టనుంది. ఇప్పటికీ ఈ భవన నిర్మాణం పునాదుల దశ దాటకపోవడంతో జింకానా వైద్యులు మరోసారి దృష్టిసారించారు. ఎంసీహెచ్ విభాగం నిర్మాణానికి అయ్యే ఖర్చు 85 కోట్లు విరాళంగా అందజేయాలని నిర్ణయించారు. దీంతో నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి.
ఒక్క సంతకంతో ఆస్తి మొత్తం ఆసుపత్రికి ధారాదత్తం : తను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని ఒక్క సంతకంతో ఆసుపత్రికి ధారాదత్తం చేశారు ఆ వైద్యురాలు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి తన దగ్గర ఒక్క రూపాయి సైతం మిగుల్చుకోలేదు. మొత్తంగా రూ.20 కోట్ల (2.50 మిలియన్ డాలర్లు)చేసే తన ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మించబోయే మాతా శిశు సంక్షేమ భవనం కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు డాక్టర్ ఉమ. గుంటూరు జిల్లాకు చెందిన ఆమె అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.