marriages : మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్న వీరు పుట్టుకతోనే దివ్యాంగులు. వారికి ఉన్న శారీరక లోపం కారణంగా పెళ్లి అనేది ఆమడ దూరంలో ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. తమ జీవితాలు ఇంతేనా అనుకుని నిస్తేజంగా ఉన్న తరుణంలో, గుంటూరులోని స్వచ్ఛంద సంస్థ చేసిన ప్రయత్నం వీరి జీవితాల్లో కొత్త వెలుగు నింపింది.
దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ..
దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ నిర్వహించిన పరిచయ వేదిక ద్వారా.. ఒకరినొకరు ఇష్టపడిన వారికి ఆ సంస్థ ఆధ్వర్యంలో వివాహాలు జరిపిస్తున్నారు. ఈ పరిచయ వేదికలకు వచ్చేవారిలో సాధారణ యువతీ, యువకులూ ఉంటున్నారు. గుంటూరులో జరిగిన వివాహ వేడుకలో సమర్థకుమార్ అనే యువకుడు.. విజయలక్ష్మి అనే దివ్యాంగురాలిని పెళ్లాడి ఆదర్శంగా నిలిచారు. మిగతా రెండు జంటలు దివ్యాంగులే. వివాహం ద్వారా ఒక్కటైన జంటలకు చట్టపరంగా ఇబ్బందులు లేకుండా సంస్థ తరఫున రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. తమకు జీవితంలో పెళ్లి కాదనుకున్న తరుణంలో.. ఇన్ఫో సొసైటీ ముందుండి పెళ్లి జరిపించడం పట్ల నూతన వధూవరులు ఆనందం వ‌్యక్తం చేస్తున్నారు.