Diamond Jubilee: సమాజం నుంచి మనం తీసుకోవడమే కాదు... సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే లక్ష్యంతో 60 ఏళ్ల క్రితం ఏర్పాటైంది గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల. సామాజిక బాధ్యతతో ఏర్పడిన ఈ ప్రతిష్టాత్మక పాఠశాల తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు అధిగమించి అస్థిత్వాన్ని నిలుపుకుని ప్రత్యేకత సాధించింది. విద్యార్థి సమగ్ర వికాసానికి అనువైన వాతావరణం, విద్యాభిలాష కలిగించేలా తరగతులు ఈ పాఠశాల సొంతం. విశాలమైన క్రీడామైదానం, ఇండోర్ గేమ్స్ సౌకర్యాలు పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలను మిగిలిన పాఠశాలల కంటే భిన్నంగా నిలుపుతున్నాయి.
Diamond Jubilee: 60 ఏళ్లలో వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసించారు. ఇక్కడ వేసుకున్న జ్ఞాన పునాదులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఉన్నత స్థానాలను అధిరోహించారు. ప్రస్తుత నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, కశ్మీర్ డీజీగా పనిచేస్తున్న గూడూరు శ్రీనివాస్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వైద్యబృందంలో సభ్యుడిగా పనిచేసిన కార్డియాలజిస్టు డాక్టర్ శివకుమార్, కృష్ణపట్నం పోర్ట్ ఎండీ కర్నాటి వెంకటేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ చదువుకున్నవారే. వీరితోపాటు.. ఇంకెందరో ఇక్కడ చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులయ్యారు. మరికొందరు వైద్యులు, ఇంజనీర్లుగా దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్నారు.