దిల్లీ వెళ్లొచ్చిన ఆ 500 మంది క్వారంటైన్ దిల్లీలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి రాష్ట్రానికి వచ్చిన వారిలో పలువురికి కరోనా వైరస్ సోకింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ కేసులు బయటపడ్డాయి. అప్రమత్తమైన యంత్రాంగం జిల్లాల వారీగా దిల్లీ వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించగా 500 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో 280 మంది, నెల్లూరు జిల్లాలో 70 మంది వరకూ ఉన్నారు. మిగిలిన ఇతర జిల్లాల్లో 12 నుంచి 46 మంది వరకు ఉన్నారు. వీరంతా క్వారంటైన్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
వారంతా క్వారంటైన్‌లో
గుంటూరు చెందిన ఓ వ్యక్తి ఈనెల మూడో వారంలో దిల్లీ వెళ్లి ఇటీవలే రైల్లో విజయవాడకు చేరుకున్నారు. ఈయన ఆసుపత్రిలో చేరకముందే 130 మందిని కలుసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈయనకు పాజిటివ్ రాగానే భార్య పిల్లలకు పరీక్షలు చేశారు. భార్యకు పాజిటివ్ వచ్చింది. అతనితో కలిసి తిరిగిన ఇద్దరిలో పాజిటివ్ లక్షణాలు బయటపడటం వల్ల యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు దిల్లీ కార్యక్రమానికి అతనితో పాటు వెళ్లినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావుకు సమాచారం రావటం వల్ల ఆయన రెండు జిల్లాల ఎస్పీలకు ఈ సమాచారం తెలిపారు. దిల్లీ నుంచి చీరాల వచ్చిన దంపతులతోపాటు మొత్తం 280 మంది రైల్లో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. దిల్లీ నుంచి వచ్చిన వారిలో ఒంగోలు రైల్వేస్టేషన్‌లో 200 మంది, చీరాలలో 80మంది దిగినట్లు తెలిసింది. వీరందరినీ గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు.
ఇదీ చదవండి :'వాలంటీర్లు ఉండగా చౌక దుకాణాల వద్ద క్యూ ఎందుకు..?'