2018 యాజమాన్య కోటాలో చేరిన డీఎడ్ వారికి వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. అప్పుడు పరీక్షలు రాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడెందుకు ఆ నిర్ణయాన్ని అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరీక్ష నిర్వహిస్తామని స్వయంగా చెప్పినా... ఇంత వరకు ఆ హామీపై స్పందన లేదన్నారు. మరోవైపు 2019 బ్యాచ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారన్నారు. తద్వారా తాము మానసికంగా కుంగిపోతున్నామని చెప్పారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.