ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPM News: సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు.. అమరావతికి మద్దతుగా తీర్మానం - cpm mahasabhalu news

CPM State 26th Mahasabha at Tadepalli: గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన సమావేశంలో సభ పలు తీర్మానాలు చేసింది. నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం డిమాండ్​ చేసింది. పోలవరం, విశాఖ ఉక్క కర్మాగారం ప్రైవేటీకరణ అంశాలతోపాటు రాష్ట్రంలో అనుసరించాల్సిన రాజకీయ వైఖరి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేయాల్సిన పోరాటాలపై తీర్మానాలు చేశారు.

CPM State 26th Mahasabha at Tadepalli
సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు

By

Published : Dec 30, 2021, 4:33 AM IST

CPM State 26th Mahasabha News: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం డిమాండ్​ చేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో రాజధానిని ముడిపెట్టడం సరికాదని, మూడు రాజధానుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించింది. అమరావతి రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీల సాధనకు పోరాడతామని, మరోసారి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, దశలవారీగా మద్య నిషేధం, చెత్త, ఆస్తి పన్నులు రద్దు, మైనారిటీల అభివృద్ధికి ఉప ప్రణాళిక అమలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పోలవరం నిర్వాసితులకు పునరావాసం, దళితులపై దాడులు-సామాజిక అంశాలు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని తాడేపల్లిలో సీపీఎం రాష్ట్ర మహాసభల్లో బుధవారం (మూడో రోజు) తీర్మానించారు. ఈ తీర్మానాలను కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు, మంతెన సీతారాం, ప్రభాకరరెడ్డి మీడియాకు వెల్లడించారు.

‘భౌగోళికంగా అమరావతి రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంది. శాసనసభ ఒకచోట, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు మరోచోట పెడతామనే ప్రభుత్వ ఆలోచన ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుంది. అసెంబ్లీ, పరిపాలన రాజధాని ఒక్కచోటే ఉండాలి. తెదేపా, భాజపా, వైకాపా కలిసే అమరావతిని రాజధానిగా నిర్ణయించాయి. అసెంబ్లీలో తీర్మానం చేశాయి. తెదేపా కంటే మెరుగైన రాజధానిని నిర్మిస్తామని ఎన్నికల ముందు వైకాపా ప్రకటించింది. తాడేపల్లిలో సీఎం ఇల్లు నిర్మించుకున్నారని, ఇక్కడే ఉండి రాజధానిని అభివృద్ధి చేస్తారని వెల్లడించింది. ఆ తర్వాత మాట తప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు, రాజధానికీ మధ్య పోటీపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. భాజపా అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామంటున్నారు. గత ప్రభుత్వంలో తెదేపాతో కలిసి, కేంద్రంలో ఏడేళ్లుగా అధికారంలో ఉన్న విషయం మర్చిపోయారా? భాజపా కపట నాటకాన్ని అమరావతి ఆందోళనకారులు గమనించాలి’ అని మహాసభ పేర్కొంది.

చెత్తపన్ను చూస్తే జుట్టు పన్ను గుర్తుకు వస్తోంది

చెత్త పన్నును చూస్తే జుట్టు పన్ను గుర్తుకు వస్తోందని మహాసభ అభిప్రాయపడింది. ‘పట్టణాలు, నగరాల్లో పన్నులు పెంచి ప్రజల గోళ్లు ఊడగొడుతున్నారు. ఇప్పుడు నాలా పన్నుపై పడ్డారు. రాష్ట్రానికి అప్పుల ఎర వేసి, రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకొని ప్రజా వ్యతిరేక సంస్కరణలను భాజపా అమలు చేయిస్తోంది. భాజపా చెబితే వైకాపా చేస్తోంది. కరోనా సమయంలో పన్నులు తగ్గించాల్సింది పోయి పెంచుతున్నారు. ప్రస్తుతం 15శాతం పన్ను పెంచినా భవిష్యత్తులో ఇది 100శాతం నుంచి 500శాతానికి పెరుగుతుంది. చెత్త పన్నును పట్టణవాసులపై రుద్దుతున్నారు. నీటి మీటర్లు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై పోరాటాలు చేస్తాం. ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు ఉపప్రణాళిక అమలు చేయాలి. వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో నిమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై దృష్టి సారించాలి’ అని సీపీఎం తీర్మానించింది.

పునరావాసం తర్వాతే ప్రాజెక్టు నిర్మించాలి..

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పరిహారం పూర్తి స్థాయిలో అమలు చేసిన అనంతరమే ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించాలని మహాసభ డిమాండు చేసింది. ‘పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. 1.05లక్షల కుటుంబాలకు గాను 4వేల కుటుంబాలకే పునరావాసం కల్పించారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి రూ.10.50 లక్షలు పరిహారంగా ఇవ్వాలి. నిర్వాసితుల కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాం. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి. దశలవారీగా మద్య నిషేధ వాగ్దానాన్ని ప్రభుత్వం అమలు చేయాలి ’ అని మహాసభ తీర్మానించిందని సీపీఎం నేతలు తెలిపారు.

ఇదీ చదవండి..

CPM AP New Secretary: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఎన్నిక

ABOUT THE AUTHOR

...view details