గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. గుంటూరు నగరంలోనే కొత్తగా 185 మందికి వైరస్ సోకింది. తాడేపల్లి మండలంలో 29, మంగళగిరి మండలంలో 20, గుంటూరు గ్రామీణ మండలంలో 15, నరసరావుపేట మండలంలో 15, మాచర్ల మండలంలో 8, తెనాలి, చిలకలూరిపేటలో 6 చొప్పున, వినుకొండ, పొన్నూరులో ఐదేసి కేసుల చొప్పున వచ్చాయి. వట్టి చెరుకూరు, దాచేపల్లి మండలాల్లో మూడేసి, అమరావతి, ఫిరంగిపురం, చేబ్రోలు, తుళ్లూరు, మేడి కోండూరు, సత్తెనపల్లి, పెద్దకాకాని, పత్తిపాడులో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.
తెనాలి మున్సిపల్ కమిషనర్‌కు పాజిటివ్
తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య 151కు చేరింది. తెనాలిలోనే 113 కేసులు ఉన్నాయి. తెనాలి మున్సిపల్ కమిషనర్‌కు కరోనా సోకగా.. కార్యాలయాన్ని మూసివేశారు. రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆయాచోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. సత్తెనపల్లిలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం మర్చిపోయారని మహిళలు ఆందోళన చేపట్టారు. మేడికొండూరు మండంలోని పేరిచర్లలో మెకానిక్‌గా పనిచేసే వ్యక్తి బుధవారం మృతిచెందగా..ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న 47 మంది మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.