ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్ : వెలవెలబోతున్న హోటళ్లు

అతిథి మర్యాదలు... ఆధునిక హంగులు... పసందైన రుచులు... ఇలా ఆతిథ్య రంగం మూడు పువ్వులు... ఆరు కాయలుగా నడిచేంది. అయితే కరోనా ప్రభావంతో ఆతిథ్య రంగం కళావిహీనమైంది. అతిథులు లేక హోటళ్లు వెలవెలబోతున్నాయి. బయటి రుచులను జనం ఆస్వాదించే పరిస్థితి లేదు. ఆఫర్లు పెట్టినా ఆతిథ్యం స్వీకరించేవారు లేరు. కొవిడ్ కాటుకు హోటల్ రంగం కుదేలైంది. సర్కారు సహకరిస్తేనే తిరిగి కోలుకుంటామని నిర్వాహకులు అంటున్నారు.

కరోనా ఎఫెక్ట్ : వెలవెలబోతున్న హోటళ్లు
కరోనా ఎఫెక్ట్ : వెలవెలబోతున్న హోటళ్లు

By

Published : Jul 14, 2020, 8:30 AM IST

కరోనా విపత్తు కారణంగా ఆతిథ్య రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అతిథులతో కళకళలాడే హోటళ్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆతిథ్యంతో పాటు రకరకాల కార్యక్రమాలు, ఆహార పండుగలు నిర్వహిస్తూ హోటళ్లల్లో సందడి వాతావరణం కనిపించేది. కరోనాతో పరిస్థితి తలకిందులైంది.గతంలో జరిగే వ్యాపారంలో 20 శాతం వ్యాపారం నడవటం కష్టంగా మారిందని హోటళ్ల యాజమానులు అంటున్నారు. ఒకప్పుడు వందలాది మంది సిబ్బందితో నడిచిన హోటళ్లు.. ఇపుడు పది, ఇరవై మందితో నడిపిస్తున్నారు.

అదనపు భారం

కరోనా హోటల్ నిర్వహణను పూర్తిగా మార్చేసింది. హోటల్ ప్రాంగణాన్ని, గదులను సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో తరచూ శుభ్రం చేయాల్సివస్తోంది. సిబ్బందితో పాటు అతిథుల విషయంలోనూ వైరస్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ అదనపు భారంగా మారాయి. ఆక్యుపెన్షీ 10, 15శాతానికి పడిపోయిందని నిర్వాహకులు అంటున్నారు. కరోనా కారణంగా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు మందగించటంతో ఆ ప్రభావం హోటళ్లపై పడింది. హోటళ్లకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

నిర్వహణ తప్పడం లేదు

హోటల్ గదులు నిండకపోయినా నిర్వహణ వ్యయం తప్పడంలేదంటున్నారు నిర్వాహకులు. అంతంత మాత్రం ఆక్యుపెన్సీతో సిబ్బంది జీతాలు, విద్యుత్ ఛార్జీలు, పన్నులు భరించటం భారంగా మారిందని చెబుతున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం శుభకార్యానికి 50కి మించి అతిథులు ఉండకూడదు. దీంతో హోటల్ నిర్వహకులు అందుకు తగిన విధంగా హాళ్లు తీర్చిదిద్దుతున్నారు. శానిటైజేషన్ ప్రక్రియ, 50 మందికి ఆహారం, సీటింగ్ అంతా కలిపి ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. అలాగే హోటళ్లకు అనుబంధంగా ఉండే రెస్టారెంట్లలో ఆఫర్లు ఇస్తున్నారు. అయినా బుకింగ్స్ అంతంతమాత్రంగానే ఉంటున్నాయని నిర్వాహకులు అంటున్నారు. కరోనాతో ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని చెబుతున్నారు. లాక్ డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులు, పన్నులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుంది.. జన జీవనం ఎప్పుడు కుదుటపడుతుంది... తమ వ్యాపారాలు ఎలా పుంజుకుంటాయోనన్న ఆందోళన అతిథ్యరంగంలో కనిపిస్తోంది. పాజిటివ్ కేసులు అదుపులోకి రావటంతో పాటు అన్ని రకాల వ్యాపారాలు పట్టాలెక్కినప్పుడే హోటళ్లు పూర్వస్థితికి వచ్చే అవకాశం ఉందని ఆ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details