ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NIVER : నివర్‌ తుపాను పరిహారంలో అక్రమాలు... విచారణకు ప్రత్యేక అధికారి నియామకం

గుంటూరు జిల్లాలో నివర్‌ తుపాను పరిహారం డబ్బులు పక్కదారి పట్టాయి. 2020-21 ఏడాదికి సంబంధించి పంటలు నష్టపోయిన రైతులకు చెల్లించిన సొమ్ములో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షల సొమ్ము దుర్వినియోగం కావడంతో అనర్హుల నుంచి డబ్బును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు.

నివర్‌ తుపాను పరిహారంలో అక్రమాలు
నివర్‌ తుపాను పరిహారంలో అక్రమాలు

By

Published : Aug 20, 2021, 3:49 AM IST

గతేడాది నవంబర్‌లో వచ్చిన నివర్‌ తుపాన్‌ ధాటికి గుంటూరు జిల్లాలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. డెల్టా ప్రాంతంలో ప్రధానంగా వరితో పాటు అరటి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుల్లో ఎక్కువమంది కౌలు రైతులు ఉండడం, కొందరి పేర్లు ఈ-క్రాప్‌లో నమోదు కాకపోవడంతో నాణ్యత దెబ్బతిన్న పంటల్ని సైతం వారు మద్దతు ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఈ-క్రాప్‌ నమోదులో కాస్త సవరణలకు అవకాశం కల్పించారు. భూ యజమానితో పాటు సాగుదారుని కింద కౌలు రైతుల పేర్లు చేర్చడానికి అవకాశమిచ్చారు. దీన్ని అదునుగా చేసుకుని కొందరు వ్యవసాయ శాఖ సిబ్బంది సవరణ వెసులుబాటును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

రైతుల ఫిర్యాదుతో...

ఈ క్రాప్‌ సవరణలో భాగంగా వారి బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ల పేర్లు నమోదు చేశారు. సర్వే నంబర్‌, భూ యజమాని పేర్లు అలాగే ఉంచి ఆధార్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతాలు మాత్రం మార్చేశారు. డెల్టాలో పంట నష్టపోతే కాకుమాను, వ‌ట్టిచెరుకూరు, చేబ్రోలు మండలాల్లోని రైతుల ఖాతాల్లో పరిహారం జమ అయింది. పరిహారం సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయని వట్టిచెరుకూరు మండలానికి చెందిన రైతులు కారంపూడిపాడు గ్రామంలోని కొందరి అనర్హుల ఖాతాల్లోకి వెళ్లాయని అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై విచారణకు ఆదేశించింది.

హోంమత్రి దృష్టికి...

బాధిత రైతులు తొలుత 12 మంది పేర్లుతో అనర్హుల జాబితాని అధికారులు ఇచ్చారు. ఆ తర్వాత సుమారు 150 మందితో కూడిన జాబితాను ఇచ్చి వారందరికీ అర్హత లేకపోయినా సొమ్ము జమ అయిందని ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లి సొమ్ము రికవరీ చేయాలని కోరారు. ఈ-క్రాప్‌ నమోదు పూర్తైన తర్వాత వాటిలో సవరణలు చేయడానికి అవకాశం ఉండదు. కానీ అప్పట్లో కౌలు రైతులకు కల్పించిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేశారు. ఒక్కో రైతు నాలుగు నుంచి ఐదు మండలాల్లో పంటలు సాగు చేసినట్లు చూపించారు. ఒకవేళ ఎవరైనా ఫి‌ర్యాదు చేసినా ఆ ప్రాంతానికి వెళ్లి కౌలు చేశారని మభ్యపెట్టొచ్చనే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది.

ఇతరుల లాగిన్ ఐడీ సహాయంతో...

ఇలా డెల్టా, పల్నాడు ప్రాంతాల్లో సాగు పేరుతో వారనుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి లక్షలాది రూపాయల సొమ్మును దారి మళ్లించారు. ఒక్కో వ్యక్తి నాలుగైదు మండలాల్లో సాగు చేసినట్లు చూపించినా బ్యాంకు ఖాతా మాత్రం ఒక్కటే ఇచ్చారు. వట్టిచెరుకూరు మండలంలోని ఓ వ్యక్తి ఖాతాలో ఏకంగా 3 లక్షల రూపాయలు జమయినట్లు అధికారులు గుర్తించారు. కొందరు వ్యవసాయ శాఖలోని సిబ్బంది ఇతరుల లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డు తీసుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రత్యేక అధికారి నియామకం...

నివర్‌ తుపాన్‌ పరిహారం నిధులు పక్కదారి పట్టిన వ్యవహారంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక విచారణ అధికారిని నియమించారు. పంటల పరిహారం పొందిన రైతుల జాబితా కావాలని ఆయన ఇప్పటికే ఎన్‌ఐసీ అధికారులకు లేఖ రాశారు. విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నివర్‌ తుపాను పరిహారంలో అక్రమాలు

ఇవీచదవండి.

MISSING : యువతి అదృశ్యం... కేసు నమోదు

NOTICE : ధూళిపాళ్ల వీరయ్య చౌదరి స్మారక ట్రస్టుకు నోటీసులు

AVANTI: ఆదరణ చూడలేకే తప్పుడు ఆడియో టేపులు: అవంతి

ABOUT THE AUTHOR

...view details