ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి

కరోనా మహమ్మారి గుంటూరు, కర్నూలు జిల్లాలను వణికిస్తోంది. 93 కరోనా పాజిటివ్‌ కేసులతో గుంటూరు మొదటి స్థానంలో, 84 కేసులతో కర్నూలు రెండో స్థానంలోనూ ఉన్నాయి. సోమవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 40.28 శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి. దిల్లీ నుంచి వచ్చినవారిని గుర్తించడంలో జరిగిన జాప్యం, కరోనా నిర్ధారణ పరీక్షలు ఆలస్యమవడం, వారిని గుర్తించేలోగానే మరికొందరికి వ్యాధి వ్యాపించడం వంటివి దీనికి ప్రధాన కారణాలు.

corona situation in Guntur and Kurnool
గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి

By

Published : Apr 14, 2020, 8:48 AM IST

కర్నూలుతో పోల్చితే గుంటూరు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కర్నూలులో కరోనా పాజిటివ్‌ కేసుల్లో దిల్లీ నుంచి వచ్చినవారే ఎక్కువ మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో దిల్లీ నుంచి వచ్చినవారికంటే వారికి సన్నిహితంగా మెలిగినవారు (ప్రైమరీ కాంటాక్ట్‌), మళ్లీ వీరితో సన్నిహితంగా ఉన్నవారి (సెకండరీ కాంటాక్ట్‌)లోనే ఎక్కువ పాజిటివ్‌ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరులో మొత్తం కేసుల్లో 65 వరకు జిల్లా కేంద్రంలోనే ఉండటం మరింత ఆందోళనకర పరిణామం. అక్కడ ముగ్గురు, నలుగురు వల్లే ఎక్కువ మందికి కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. జిల్లాలో కరోనా సోకినవారిలో కొందరు ఎలాంటి దూర ప్రయాణాలూ చేయకపోయినా, దిల్లీ, విదేశాల నుంచి వచ్చిన వారికి సన్నిహితంగా మెలగకపోయినా వైరస్‌ బారినపడ్డారు. దీన్నిబట్టి జిల్లాలో సమూహ వ్యాప్తి మొదలైందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

స్పందించకపోవడం వల్లే...

రాష్ట్రంలో దిల్లీ నుంచి వచ్చినవారిలో మొదటి కరోనా కేసు బయటపడింది గుంటూరులోనే. ఆ వ్యక్తికి కరోనా ఎందుకు సోకింది..? ఆయన ఎక్కడికి వెళ్లి వచ్చారు..? ఇంకా దిల్లీ నుంచి వచ్చినవారు ఎందరు..? అన్నది గుర్తించడంలోనూ, కేసులు బయటపడ్డ ప్రాంతాల్లో ప్రజల కదలికలపై ఆంక్షలు పెట్టడంలోనూ కొంత జాప్యం జరిగింది. అధికారులు మేలుకునేసరికే పరిస్థితి అదుపు తప్పింది. అనుమానితుల్ని గుర్తించి నమూనాలు సేకరించడం, పరీక్షలు చేయడంలోనూ జాప్యం జరిగింది. ఇప్పుడు ప్రజల వద్దకే వెళ్లి నమూనాలు సేకరిస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో మొదట్లో సరైన సౌకర్యాల్లేవు. క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో దిల్లీ వెళ్లినవారితో సన్నిహితంగా మెలిగినవారు ఆ విషయం బయటపెట్టలేదు.

ఒకరి నుంచి 10 మందికి...

దిల్లీ వెళ్లొచ్చినవారితో సన్నిహితంగా ఉన్నవారిని ఐదారు రోజులు ఐసొలేషన్‌లో ఉంచి అప్పుడు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అని తేలితే అప్పుడు వారితో సన్నిహితంగా ఉన్నవారెవరు..? అని గాలించడం మొదలుపెట్టారు. ఆలోగానే మరికొందరికి వైరస్‌ సోకింది. దిల్లీ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతని నుంచి కుటుంబంలో మరో 10 మందికి వ్యాపించడం గుంటూరులో పరిస్థితికి నిలువుటద్దం.

వ్యక్తిగత దూరం పట్టని ప్రజలు...

గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఆంక్షలు కఠినతరం చేశారు. రెడ్‌ జోన్లలో ఇంటింటికీ పాలు కూడా జిల్లా యంత్రాంగమే సరఫరా చేస్తోంది. గుంటూరు నగరంలోని మొత్తం కేసుల్లో 60 శాతం వరకు ఆనంద్‌పేట, కుమ్మరిబజారు, సంగడిగుంటల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నట్టు చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ వ్యక్తిగత దూరం పాటించకపోవడం గమనార్హం.

పరీక్షలు జాప్యం...

కర్నూలు జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదయ్యాక కొన్ని రోజులపాటు ఆ సంఖ్య నాలుగు దాటలేదు. దిల్లీ వెళ్లి వచ్చినవారు, వారికి సన్నిహితంగా మెలిగినవారి నుంచి నమూనాలు సేకరించినా, పరీక్షలు చేయడంలో జాప్యమే దీనికి కారణం. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ సంఖ్య 50 దాటిపోయింది. జిల్లాలో ఇప్పుడిప్పుడే సెకండరీ కాంటాక్ట్‌ కేసులూ నమోదవుతున్నాయి. 84 కేసుల్లో కర్నూలు పట్టణంలో 21, నంద్యాలలో 19 ఉన్నాయి. 13 మండలాల్లో కరోనా కేసులున్నాయి. కరోనా అనుమానితుల్ని గుర్తించి క్వారంటైన్‌కి పంపడంలోనూ జాప్యం జరిగింది. గ్రామాల్లో కొందరు క్వారంటైన్‌కి వెళ్లబోమని అధికారులతో గొడవ పడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details