కరోనా ప్రారంభం నుంచి తీవ్రస్థాయిలో ప్రభావితమైన జిల్లా గుంటూరు. ప్రత్యేకించి గుంటూరు నగరంలోనే సగానికి పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో యాక్టివ్ కేసులు 5 వేల వరకూ ఉన్నాయి. కొవిడ్ కట్టడికి నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకూ నగరంలోని 63 ప్రాంతాలను గుర్తించారు. అక్కడ పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గతంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నియంత్రించారు. అందుకు బారికేడ్లు ఏర్పాటు చేసేవారు.
ఈసారి అలాంటిదేమీ లేదు. మైక్రో కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీనికి 20 మీటర్ల పరిధిని నిర్ణయించారు. ప్రజలను అప్రమత్తం చేయటమే వీటి ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. వీటిని చూసి ప్రజలు అన్నిచోట్లా ఇష్టారాజ్యంగా తిరగకుండా ఉంటారని భావిస్తున్నారు. వీరిలో చాలామంది ఇళ్లలో ఉండే చికిత్స తీసుకుంటున్నారు. ఇతరులు తెలిసో తెలియకో వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళితే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వారిని అప్రమత్తం చేసేలా మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.
ఇలాంటివి చూశాక అనవసరంగా బయటకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈనెల 22 నుంచి సాయంత్రం 6గంటలకే దుకాణాలు మూసివేయిస్తున్నారు. దుకాణాలు త్వరగా మూసివేయటంతో సాయంత్రం 6గంటల తర్వాత బయటకు వచ్చేవారి సంఖ్య తగ్గింది. కరోనా పరీక్షలు చేయించుకున్న వారు ఫలితం వచ్చే వరకూ ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీన్ని ఎవరైనా ఉల్లంఘించారా అనేది స్థానిక వాలంటీర్లు, వార్డు సచివాలయ సిబ్బందితో పర్యవేక్షిస్తామని కమిషనర్ అనురాధ తెలిపారు.