పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది తెలంగాణ మిర్చి రైతుల పరిస్థితి. సాగుకాలంలో తెగుళ్లతో ఇబ్బంది పడ్డారు. చేతికొచ్చి సమయానికి వడగండ్ల వాన దెబ్బతీసింది. తీరా పంట చేతికొచ్చాక... అమ్ముకుందామంటే కరోనా కాటేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తోయక మిర్చి రైతులు కుమిలి పోతున్నారు. లాక్డౌన్ కారణంగా మార్కెట్ మూతపడి అమ్ముకునేందుకు వీలు లేకుండా పోయింది. పెట్టుబడికి తెచ్చిన అప్పుల వడ్డీలు పెరిగిపోతున్నాయి. కూలీలు కూడా చెల్లించలేని స్థితిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
రైతుబంధుతో ఆసరా
గతేడాది ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకున్న రైతులకు ప్రస్తుత పరిస్థితి కాస్త ఊరట కల్పించినా... కరోనా కట్టడికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్తో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ రంగానికి ఇచ్చిన వెసులుబాటుతో ఊరటనిస్తోంది. పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్న వారికి రైతుబంధు పథకం ద్వారా రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులు శీత గిడ్డంగులకు తరలిస్తున్నారు. కానీ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ముందుగానే బుక్ చేసుకోవడం... రైతుల పాలిట శాపంగా మారింది.