గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 568 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 5 వేలు దాటింది. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క గుంటూరు పరిధిలోనే 235 ఉండటం వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. తాడేపల్లిలో మరో 70, నరసరావుపేట 36, పిడుగురాళ్ల 29, తెనాలి 28, మంగళగిరి 26, దాచేపల్లి 20, ప్రత్తిపాడు 20, సత్తెనపల్లి 17, వినుకొండ 15, పెదకాకానిలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి.
మిగతా మండలాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. పల్లె, పట్నం అని తేడా లేకుండా కరోనా కోరలు చాస్తోంది. జిల్లాలో 200 మందికి పైగా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పిటికే కరోనా బారినపడ్డారు. గురజాల పరిధిలో 16వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించినట్లు ఆర్డీవో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు వ్యాపార, వర్తక దుకాణాలు కొనసాగుతున్నాయి. వ్యాధి లక్షణాలు అంతగా కన్పించనివారు, కొద్దిగా ఉన్నవారిని హోం ఐసోలేషన్లో ఉంచుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రుల బెడ్లను సిద్ధం చేస్తున్నారు.