ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కట్టడికి చతుర్ముఖ వ్యూహం - corna cases in narsarao peta

గుంటూరు జిల్లాలో కరోనా కట్టడి కావడం లేదు. నగరంలో కొంత మేర అదుపులో ఉన్న కరోనా కేసులు.. సరసరావుపేటలో విజృంభిస్తున్నాయి. మహమ్మారిని నివారించేందుకు అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. నిన్న ఒక్కరోజే నరసరావుపేటలో 10 కేసులు నమోదయ్యాయి.

CORONA CASES IN GUNTUR DISTRICT
గుంటూరులో కరోనా కేసులు

By

Published : May 7, 2020, 11:06 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట పట్టణంలో 10, గుంటూరు నగరంలోని అహ్మద్‌నగర్‌, కుమ్మరిబజారులో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 363కు చేరుకుంది. 129 మందికి నయమై ఇంటికి వెళ్లగా, 226 మంది చికిత్స పొందుతున్నారు.

8 మంది మృతిచెందారు. 10 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరం కంటే 1.18 లక్షల జనాభా ఉన్న నరసరావుపేటలో కేసులు ఎక్కువగా నమోదుకావడం అక్కడ కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. గుంటూరు నగరంలో ప్రారంభంలో కేసుల సంఖ్య నమోదు ఎక్కువగానే ఉన్నా క్రమంగా కట్టడి చేయగలిగారు. ప్రస్తుతం రోజువారీగా ఐదులోపే కేసులు నమోదవుతున్నాయి.

నరసరావుపేటను వణికిస్తోంది...

నరసరావుపేటలో కరోనా కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో వరవకట్ట ప్రాంతంలోనే 127 కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి కోసం అధికారులు చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సంపూర్ణంగా లాక్‌డౌన్‌ అమలుచేయడం, ప్రజల అవసరాలు తీర్చడం, పాజిటివ్‌ కేసుల లింకులపై సమగ్ర సమాచార సేకరణ, వ్యాధి నిర్ధరణ పరీక్షల వేగవంతం చేయడం ద్వారా వైరస్‌ నియంత్రణకు నడుంకట్టారు.

ఈనెల 15 తర్వాత కొత్త కేసులు ఏమి నమోదు కాకూడదనే లక్ష్యంతో ‘మిషన్‌ మే 15’కు రూపకల్పన చేశారు. రెవెన్యూ, పోలీసు, పురపాలక, వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ప్రజారోగ్యశాఖ భాగస్వామ్యంతో మిషన్‌ చేపట్టారు. దీనిపై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కసరత్తు చేసి ప్రణాళిక రూపొందించారు.

సంపూర్ణ లాక్‌డౌన్‌

వైరస్‌ కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అధికారులు మొదటి అంశంగా ఎంచుకున్నారు. ఆయా కాలనీల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే అధికారులు గుర్తించి క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు కోసం 300 మంది పోలీసులను నియమించారు. అదనపు ఎస్పీ చక్రవర్తితో పాటు డీఎస్పీ వీరారెడ్డి క్లస్టర్లతో పాటు పట్టణంలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు.

పాజిటివ్‌ లింకులపై ఆరా

నరసరావుపేట పట్టణంలోకి కరోనా వైరస్‌ ఎలా వచ్చిందన్న విషయమై అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా పట్టణంలో కేబుల్‌ ఛార్జీలు వసూలు చేసే వ్యక్తికి వైరస్‌ వచ్చినట్లు గుర్తించారు. అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులు, హోంగార్డుకు వచ్చినట్లు తెలిసింది. వీరి ద్వారా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి వచ్చింది. అక్కడి నుంచి ఒకరి ద్వారా మరొకరికి ఇలా వందల మందికి విస్తరించింది. పాజిటివ్‌ వచ్చిన వారి కదలికలు నమోదు చేసి వారు కలిసిన వారినందరినీ ఆరా తీస్తున్నారు. అనుమానితులను గుర్తించడం ద్వారా ఇతరులకు సోకకుండా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు.

విస్త్రృతంగా నిర్ధారణ పరీక్షలు

పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి ఇంటిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ర్యాపిడ్‌ కిట్లు, ట్రూనాట్‌ పరికరాలు ఇందుకు ఉపయోగిస్తున్నారు. 25 మందిపైగా వైద్యులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. 60ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని, కుటుంబసభ్యులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్ల ముందు కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం, అష్టాచమ్మా ఆడుకోవడం వంటివి ఆడటం వల్ల వైరస్‌ విస్తరిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇంటి వద్దకే నిత్యావసర సరకులు

క్లస్టర్‌లో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలంటే వారికి అవసరమైనవి సమకూర్చాలని అధికారులు గుర్తించారు. పాలు, పండ్లు, కూరగాయలు, సరకులు ఇళ్ల వద్దకే చేరేలా మొబైల్‌ వాహనాలు ఏర్పాటుచేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎవరికి అవసరం వచ్చినా స్పందించేలా వాలంటీర్లు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులను వినియోగిస్తున్నారు. ఇక్కడంతా రోజువారీ కూలీలు కావడంతో వారికి పూట గడవడం కష్టంగా మారింది. కరోనా సాయం, ప్రభుత్వ రేషన్‌ సరిపోని పరిస్థితి. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు దాతల సాయంతో ఇంటింటికి నిత్యావసరాల కిట్లు అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం..ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details