NO WORK TO CONSTRUCTION LABOUR: రోజువారీ పనుల కోసం కూలీలు గుంటూరు నగరంలో రోజూ అనేక చోట్ల... ఉదయాన్నే నిరీక్షిస్తుంటారు. లాడ్జ్ సెంటర్, గాంధీ పార్కు, చుట్టగుంట ప్రాంతాల్లోని అడ్డాల్లో ఎదురుచూస్తూ కనిపిస్తారు. భవన నిర్మాణం, వ్యవసాయ, మట్టి పనులు..ఇలా దేనికోసం పిలిచినావెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిని కదిలిస్తే కష్టాల చిట్టా విప్పుతున్నారు. కరోనాకు ముందు ఇసుక దొరక్క,.. భవన నిర్మాణ పనులు ఆగిపోయి... ఉపాధి కరవైంది. ప్రస్తుతం కొంత ఇసుక కొరత తీరినా... కూలీల సంఖ్యకు తగినట్లు పనులు జరగడంలేదు. ఫలితంగా ఎంతో మంది పనుల్లేక అల్లాడుతున్నారు.
గతంలో తీరిక లేకుండా గడిపిన కూలీలు ఇప్పుడు ఆశించిన స్థాయిలో భవన నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం వల్ల.. ప్రస్తుతం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పెరిగిన సిమెంట్, ఇసుక, ఉక్కు ధరలు భవన నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. మొదటి విడత లాక్‌డౌన్‌తో చేసిన అప్పులు ఇప్పటికీ తీరకపోగా.. రెండో విడత కరోనాతో మరింత కుదేలయ్యారు. కొందరికే పనులు దొరికినా కొద్దిపాటి ఆదాయంతోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది.