Council meeting: చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
Conflict between councilors: చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. తమ వార్డులో అభివృద్ధి పనులు చేయట్లేదని వైకాపా కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అధికారులు ప్రతి పనికి లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు.
Conflict between councilors: చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల అత్యవసర సమావేశం ఆందోళనలు, నిరసన మధ్య సాగింది. సభ ప్రారంభానికి ముందు పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించొద్దంటూ... తెలుగుదేశం కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. మానుకొండవారిపాలెంకు చెందిన 11వ వార్డు వైకాపా కౌన్సిలర్ మాధవీ రెడ్డి... ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి తమ ప్రాంతంలో ఏ పనులు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి పనికి లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. కౌన్సిల్ హాలు బైట బైఠాయించి నిరసన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వద్ద లక్ష రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారని తెలుగుదేశం కౌన్సిలర్లు నినదించారు. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల ఆందోళనలతో మున్సిపల్ కార్యాలయం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది.