కృష్ణా జిల్లా తిరువూరులో.. ఏపీ-తెలంగాణ సరిహద్దుకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. లాక్డౌన్ కారణంగా తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న వాహనాలను పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించటం లేదు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు నిలిపివేయటం వల్ల వాహనదారులు తిరువూరు వైపు వస్తున్నారు. ఈ కారణంగా తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టులను మూసివేశామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి చెక్ పోస్ట్ వద్దకు తెలంగాణ నుంచి భారీగా వాహనాలు చేరుతున్నాయి. రాష్ట్రంలోకి మాత్రం అనుమతించబోమని పోలీసులు కచ్చితంగా చెబుతున్నారు. ఇక్కడకు వచ్చిన వాహనాలను తిప్పి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో...
అనంతపురం జిల్లాలోని ఏపీ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో... లాక్డౌన్ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గత రెండు రోజులుగా కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించటం లేదు. మంగళవారం బెంగళూరు నుంచి పెద్దఎత్తున స్వంత గ్రామాలకు వచ్చేందుకు యత్నించిన వారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాలపై వస్తున్న వారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ఈ విషయంపై కర్ణాటక పోలీసులకూ సమాచారం ఇచ్చారు. అక్కడ 44వ నంబరు జాతీయ రహదారిపైకి ఎవరినీ అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, అనుమతిస్తే వారిని క్వారంటైన్లో ఉంచుతామని హెచ్చరిస్తుండటం వల్ల చాలామంది వెనక్కి వెళ్లిపోయారు. బుధ, గురువారాల్లో పోలీసులు తీసుకున్న చర్యలతో బెంగళూరు నుంచి ఎవ్వరూ అనంతపురం జిల్లాలోకి రావటంలేదు. కొడికొండ చెక్ పోస్టు వద్ద 44వ నంబరు జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది.
కూలీల పాట్లు