Cold Storages:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పవర్ హాలిడే... గుంటూరు జిల్లాలోని శీతల గోదాముల నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది. కరెంటు సరఫరా లేకపోతే గోదాముల్లోని సరుకు పాడైపోతుంది. సరుకును కాపాడాలంటే జనరేటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. అయితే పెరిగిన డీజిల్ ధరలతో జనరేటర్ల వాడకం కూడా గిడ్డంగుల యజమానులకు భారంగా మారుతోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో... సుమారు 150వరకు శీతల గోదాములున్నాయి. ఇక్కడ మిర్చి యార్డు ఉండటంతో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా శీతల గోదాములు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని గోదాములు 50శాతానికి పైగా మిర్చి నిల్వలతో నిండిపోయాయి. వీటి నిర్వహణకు విద్యుత్ ఎంతో కీలకం. సరకు పాడైపోకుండా ఉండాలంటే.... 8 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కొద్దిరోజులుగా కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న గిడ్డంగుల యజమానులు... పవర్ హాలిడే ప్రకటనతో నిర్వహణ ఎలా అని తలలు పట్టుకుంటున్నారు.