నవరత్నాలే ప్రధాన అజెండాగా తొలిరోజు కలెక్టర్ల సదస్సు జరగగా.. రెండో రోజూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కీలకంగా చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 11 .30 గంటల వరకూ వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని 108, 104 అంబులెన్స్ సేవలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం, వ్యాధుల నివారణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల లభ్యత వంటి అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ సేవలపై ఎక్కువ దృష్టిసారించాలని కలెక్టర్లకు సూచించనున్నారు. వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే వైద్య సేవలన్నీ పేదలకు ఉచితంగా అందిండానికి మార్గాలను అన్వేషించాలంటూ సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. దేశవిదేశాల్లోని వివిధ వైద్యవిధానాలను పరిశీలించి.. ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. దీని ఆధారంగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని పునర్వచించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు స్త్రీ శిశు సంక్షేమం, శిశు జనన మరణాల రేటు, పౌష్టికాహారం తదితర అంశాలు, రహదారి ప్రాజెక్టుల త్వరితగతిన చేపట్టటం వంటి అంశాల్లోనూ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పంచాయతీరాజ్ విభాగంపైనా సీఎం దృష్టి పెట్టనున్నారు.
శాంతిభద్రతలు.. సంక్షేమ పథకాలపై నేడు సీఎం సమీక్ష - collectors conference
వచ్చే ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించనున్న విధానాన్ని జిల్లా అధికారులు, ఉన్నతాధికారులకు నిన్నటి సమావేశంలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్... నేడు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో భేటీ కానున్నారు. ప్రభుత్వ అధికారులు వ్యవహరించాల్సిన తీరును సుస్పష్టం చేసిన సీఎం.. ఇవాళ సమావేశంలో వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, రహదారులు, పంచాయతీరాజ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.
జగన్
రాష్ట్రంలోని శాంతిభద్రతల అంశంపై ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తారు. రాష్ట్రంలో శాంతియుతమైన వాతావరణం నెలకొల్పేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.