ఈ వినాయక చవితి పండుగతోనైనా కరోనా మహమ్మారి పోవాలని మేము సైతం సభ్యురాలు శారద పిలుపునిచ్చారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మేము సైతం ఆధ్వర్యంలో కడపలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 1000 మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మోక్షిత్ అనే 4 ఏళ్ల పిల్లాడు తానే స్వయంగా మట్టి గణపయ్యను తయారుచేశాడు. తల్లిదండ్రులు చెప్పిన మెళకువలతో మట్టి విగ్రహాన్ని సునాయాసంగా తయారు చేశాడు.
గణపతిని తలచుకుంటే చాలు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా నిరాటకంగా సాగిపోతుందనేది భక్తుల విశ్వాసం. తొలిపూజ అందుకునే విఘ్నేశ్వరుడి చవితి ఉత్సవం పర్యావరణహితంగానే కాకుండా ఆదర్శవంతంగా నిలిచేందుకు అనువైన విగ్రహాన్నితయారు చేయించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెనాలి డబుల్‌హార్స్ మినపగుళ్లు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. విత్తన గణేషుని పేరిట ఎంతో ఆకర్షణీయంగా వినాయకుడి రూపాలను తయారు చేయించారు.
భక్తి శ్రద్ధలతో వినాయకున్ని పూజించిన తర్వాత నిమజ్జనం చేసే సమయంలో ఆ కుండీలోనే వినాయకుని విగ్రహాన్ని ఉంచి నీళ్లు పోస్తే కొద్ది రోజుల్లోనే అందులోని విత్తనం నుంచి మొక్క వస్తుందని.. ఇలా అందరూ చేయటం ద్వారా వాతావరణ కాలుష్యం నుంచి బయటపడొచ్చని...సంస్థ అధినేత ఎం.మోహనశ్యాం ప్రసాద్ తెలిపారు
ప్రకాశం జిల్లా ఒంగోలులో పలువురు మట్టి వినాయకుడి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం సమీపంలో లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను అందించారు.