వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల.. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 24వ వార్డులోని ఎన్టీఆర్ పురపాలక ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల తరగతి గదులు నీటితో(CLASS ROOMS FILLED WITH RAIN WATER) నిండిపోయాయి. మోకాలి లోతుకు నీరు చేరడంతో.. స్థానిక గుడి ఆవరణలోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల భవనం సరిగా లేకపోవడంతో ప్రభుత్వం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో(CONSTRUCTION STOPPED WITH PENDING BILLS) ఉండడంతో నూతన కట్టడాల పనులు కేవలం పునాదులకే పరిమితమైంది.
దీనివల్ల వర్షాలు పడితే పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. బురదలో పాఠశాల ప్రాంగణంలో తిరిగితే పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. తరగతి గదుల్లో నీరు నిడిపోవడం వల్ల పాములు, విష కీటకాలు చేరుతున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలను బడికి పంపాలంటే భయమేస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పక్కనే ఉన్న హనుమాన్ మందిరంలో పాఠాలు(CLASSES TO STUDENTS AT TEMPLE) బోధిస్తున్నారని.. విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో అక్కడ కూడా ఖాళీ సరిపోక ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్ చెబుతున్నారు. పిల్లలు మూత్రవిసర్జన చేసేందుకు కనీస వసతి కూడా లేదని.. ఉన్నాతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. పాఠశాలలో మొత్తం 63 మంది విద్యార్థులు ఉన్నారని.. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది విద్యార్థులు పెరుగుతారని స్థానికులు అంటున్నారు.