వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సుల పాఠ్యప్రణాళిక మార్చబోతున్నట్లు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియంత్రణ, పర్యవేక్షణ కమిటీతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు.
తాము చేపడుతున్న కార్యక్రమాలపై కమిషన్ ముఖ్యమంత్రికి ప్రదర్శన ఇచ్చింది. అనంతరం కీలక అంశాలపై సీఎం చర్చించారు. ఈ ఏడాది నుంచే పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వబోతున్నామని సీఎం పునరుద్ఘాటించారు. ఫీజు రీయంబర్స్మెంట్ కాకుండా డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న వారికి వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగం, ఉపాధి కల్పించేలా పాఠ్యప్రణాళిక రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఏడాది పాటు అదనంగా అప్రెంటీస్షిప్ ఇవ్వబోతున్నామని... అందువల్ల వీటిని మామూలు డిగ్రీలుగా కాకుండా... ఆనర్స్ డిగ్రీలుగా పరిగణించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉందన్న సీఎం... సరైన ప్రాక్టికల్ అనుభవం లేకపోతే పోటీ ప్రపంచంలో నిలవలేరన్నారు.