ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు' - tdp

వైకాపా సర్కార్‌ అభివృద్ధిని గాలికొదిలేసి కక్షా రాజకీయాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులకు భయపడేదే లేదని, పోరాటానికి సిద్ధంకావాలని తనను కలిసిన కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఇవాళ కాపు సామాజికవర్గ నాయకులతో సమావేశంకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

తనకు కలసుకునేందుకు వచ్చిన కార్యకర్తలతో చంద్రబాబు

By

Published : Jun 28, 2019, 5:09 AM IST

Updated : Jun 28, 2019, 1:26 PM IST

తెదేపా ప్రభుత్వ హయాంలో పారదర్శక పాలన అందించామని జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచామని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధికల్పనపై కనీసం దృష్టి సారించకపోవడం శోచనీయమని ఆక్షేపించారు. అమరావతిలోని తన నివాసంలో పలువురు నేతలు, ప్రజలను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకున్నారు. నరసరావుపేట, నందిగామ, తాడికొండ, మార్కాపురం నియోజకవర్గాల్లో వైకాపా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అరాచకాలకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై బాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులపైనే జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరి బెదిరింపులకు భయపడాల్సింది లేదని పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గుంటూరు కార్యాలయానికి బాబు

ఇప్పటివరకూ ఉండవల్లి నివాసంలోనే పార్టీ కార్యకర్తలను కలుస్తున్న చంద్రబాబు సోమవారం నుంచి గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. మంగళగిరి సమీపంలో నిర్మిస్తున్న కేంద్ర పార్టీ కార్యాలయం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తుండగా అప్పటి వరకూ గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలను చంద్రబాబు నిర్వర్తించనున్నారు.

నేడు కాపు నేతలతో కీలక భేటీ
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటూ ఇటీవలే ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్న కాపు సామాజికవర్గ నేతలతో నేడు చంద్రబాబు భేటీకానున్నారు. తాను విదేశీ పర్యటనలో ఉండగా కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమైన నేతల ఆంతర్యాన్ని అడిగి తెలుసుకోనున్నారు. మరోమారు సమావేశం కావాలని కాపు నేతలు యోచిస్తున్న తరుణంలో చంద్రబాబు వారితో ముఖాముఖి మాట్లాడి అసంతృప్తికి గల కారణాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. తెలుగుదేశం నేతలకు కమలదళం గాలం వేస్తున్న నేపథ్యంలో అసంతృప్తులతో మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు.

Last Updated : Jun 28, 2019, 1:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details