‘స్వాతంత్య్ర దినోత్సవ వేళ పట్టపగలు నడిరోడ్డుపై దళిత యువతిని దారుణంగా హతమార్చారంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘నేరస్థుడు రాజ్యమేలితే నేరగాళ్లు ఎలా పేట్రేగిపోతారో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని దుయ్యబట్టారు. హత్యకు గురైన రమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. ‘వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నేరస్థులను ప్రోత్సహిస్తున్నందువల్లే వారిలా పేట్రేగిపోతున్నారు. ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎటు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని భయాందోళన చెందుతున్నారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. నిందితులకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తున్న తెదేపా నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయించి శిక్షిస్తోంది’ అని మండిపడ్డారు.
ఆక్రందనలు ముఖ్యమంత్రికి వినపడవా..?
‘రెండేళ్లలో మహిళల భద్రత కోసం గాలి మాటలు మినహా ఈ గాలి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదు’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘మహిళలపై జరిగిన 500కిపైగా లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు వైకాపా అసమర్థ పాలనకు అద్దం పడుతున్నాయి. అన్యాయంగా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, మృగాళ్ల చేతిలో అన్యాయానికి గురైన మహిళల అక్రందనలు ముఖ్యమంత్రికి వినపడట్లేదా? తమకు అన్యాయం జరిగిందని బాధితులు పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడు లేడు’ అని పేర్కొన్నారు.