గుంటూరు జిల్లాలో ఇసుక కొరత తీవ్రరూపం దాల్చుతోంది. కొన్ని నెలలుగా కొందరు అప్పుల బాధతో కాలం గడుపుతుంటే... మరికొందరు నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో బ్రహ్మాజీ అనే కార్మికుడు, గోరంట్లకు చెందిన వెంకటేశ్వరరావు ఉపాధి దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించారు. కట్టుకున్నవాడు కానరాని లోకాలకు తరలివెళ్లటంతో వెంకటేశ్వరరావు భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది.
భవన నిర్మాణ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక రోడ్డున పడుతున్నారు. జిల్లాలో పనుల కోసమని వలస వచ్చినవారు తిరిగి తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. కరవు భత్యం ఇవ్వాలని కోరుతూ కొందరు కార్మిక శాఖ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. వీలైనంత త్వరగా నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు.
పేద కుటుంబాల్లో 'ఇసుక తుపాను' - భవన నిర్మాణ కార్మికుల సమస్యలు న్యూస్
రాష్ట్రంలో ఏర్పడ్డ ఇసుక కొరత... ఆ ఇంటి పెద్దను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ముక్కుపచ్చలారని ఓ పసిబిడ్డకు తండ్రి ప్రేమను దూరం చేసింది. కట్టుకున్నవాడి తోడు లేక.. ఆ చిన్నారిని పెంచే స్థోమత లేక ప్రభుత్వ సాయం కోసం అతని భార్య ఎదురుచూస్తోంది.
building workers families facing problem with sand