Dilapidated bridges : ప్రమాదాలు చెప్పిరావు... అప్రమత్తంగా ఉండటమే మన ముందున్న మార్గం. నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇటీవల వంతెనల పైనుంచి వాహనాలు కిందకు పడిపోయిన ఉదంతాలు తీవ్ర విషాదం నింపాయి. ఈ నేపథ్యంలో గుంటూరు-తెనాలి మార్గంలోనూ పాత చప్టాలు, చిన్నపాటి వంతెనలు ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. శిథిలావస్థకు చేరినా..వాటికి సరైన మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ప్రమాదకర స్థితిలో ఉన్న వాటిపైనే ప్రయాణించాల్సి వస్తోంది.
గుంటూరు-తెనాలి మధ్య రవాణా...
గుంటూరు-తెనాలి మధ్య ఒకప్పటి కంటే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రధాన రహదారి మధ్య రహదారుల నిర్వహణ మాటేమోగానీ... కల్వర్టులు, చప్టాలు నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. నిర్వహణలోపంతో కాలువలపై వంతెనలు, చప్టాలు మరింత ప్రమాదకరంగా మారాయి. రాత్రిపూట ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. పాత చప్టాలు కట్టి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కొత్త చప్టాలు ఏర్పాటు ప్రతిపాదన ఇంతవరకూ ముందుకు సాగలేదు. అటుగా ప్రయాణాలు సాగించాలంటేనే భయపడే పరిస్థితులున్నా రాకపోకలు కొనసాగించక తప్పటం లేదు.
అంగలకుదురు వద్ద చప్టా తీరు...
అంగలకుదురు వద్ద చప్టాను పట్టించుకోకపోవడంతో అది ప్రమాదకరంగా మారింది. రహదారి మధ్య భాగం కుంగిపోవడంతో... గోడ కట్టి ఏళ్ల తరబడి రహదారిని కొనసాగిస్తున్నారు. కింద పిల్లర్లు బీటలు వారాయి. పక్కన రక్షిత గోడలు శిథిలావస్థకు చేరి కూలిపోయే దశలో ఉన్నాయి. ఓవైపు గోడ కట్టడంవల్ల రెండోవైపు నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ మార్గంలో విపరీతంగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ప్రత్యేకంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ను ఇక్కడ ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. దినదినగండంగా ఈ మార్గంలో ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు.