ఇళ్ల స్థలాల అంశంలో ప్రజలను వైకాపా తప్పుదారి పట్టించిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. జనాన్ని మోసం చేసిన మంత్రి రంగనాథ్ రాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ.. అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందంటూ ప్రచారాలు చేయడం సరికాదని సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి జగనన్న వంచన, విద్యా దీవెనకు జగనన్న విద్యా ద్రోహిగా పథకాల పేర్లు మారిస్తే బాగుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సిగ్గులేకుండా ప్రమాణాలు చేస్తామని రోడ్డెక్కుతున్నారన్నారని దుయ్యబట్టారు. ప్రజలు తిరస్కరిస్తే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయాడని.. సీఎం జగన్ త్వరలో బెంగుళూరుకు వెళ్తారని జోస్యం చెప్పారు.
మేధావుల పేరుతో ఏపీలో ప్యాకేజీ నేతలు కొనసాగుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ.. గుంటూరులో మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్యాకేజి నేతలైన ఉండవల్లి అరుణ్ కుమార్, వడ్డే శోభనాదీశ్వరరావు వంటి నేతలు పోలవరం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేనతో కలిసి వైకాపాపై తాము పోరాటం చేస్తున్నామని.. మేధావులకు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలని సవాల్ చేశారు.