ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వ్యవసాయ మౌలిక నిధితో తెలుగు రాష్ట్రాలకు లబ్ధి: జీవీఎల్

By

Published : Oct 8, 2020, 7:42 PM IST

కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం జరగదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన ఆయన... వ్యవసాయ చట్టాలపై కర్షకులకు అవగాహన కల్పించారు. మరోవైపు లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని కేంద్ర ఏర్పాటు చేయనుందని.... దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

mp gvl
mp gvl

వ్యవసాయ రంగంలో మౌళిక వసతుల కల్పన కోసం రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్​కు 6,500 కోట్లు, తెలంగాణకు 3,500 కోట్ల రూపాయలు రానున్నట్లు రాజ్యసభ సభ్యుడు, మిర్చి టాస్క్​ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. మిర్చి, స్పైసెస్ బోర్డు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ అయిన తరువాత తొలిసారిగా గుంటూరు మిర్చి యార్డును ఆయన గురువారం సందర్శించారు. అక్కడ మిర్చి రైతులను ప్రత్యక్షంగా కలిసి... వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.

21 లక్షల కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ఏర్పాటు చేస్తారని జీవీఎల్ వివరించారు. నాబార్డు ద్వారా ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు దీనివల్ల లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటిదాకా 7 వేల శీతల గోదాములు మాత్రమే ఉండగా.. ఈ పథకం సహాయంతో వచ్చే నాలుగైదు ఏళ్లలో అదనంగా మరో 10వేల గోదాములు రైతులకు అందుబాటులోకి వస్తాయని వివరించారు. 10 వేల రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి.. వారికి 7 వేల కోట్ల రూపాయల సాయం అందిస్తామన్నారు. ఏపీలోనే 2 వేల వరకూ రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని మెరుగు పరుస్తాయన్నారు. వీటి ద్వారా రైతులకు మంచి ధరలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని.. భూమి హక్కులకు ఏమాత్రం భంగం వాటిల్లదని ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details