ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు పొంతన లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రబీ సీజన్‌కు సంబంధించి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామన్న ప్రభుత్వం.. ఇప్పటివరకు కేవలం 25.25 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసిందన్నారు.
లబ్ధిదారులకు పింఛను.. ఏ నెలలో.. ఏ రోజున.. ఎంతమందికి ఇచ్చామని వెల్లడిస్తున్న ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు సమాచారం ఎందుకు రైతులకు చెప్పడంలేదని ప్రశ్నించారు. సేకరించిన ధాన్యానికి చెల్లింపులు కూడా పౌరసరఫరాల శాఖ సరిగా చేయటం లేదని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు మిల్లర్లకు, దళారులు పరోక్షంగా సహకరించేలా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కేవలం గుడివాడకు మాత్రమే మంత్రా..? లేక రాష్ట్రానికా..? తెలియడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ముసుగులో ఉన్న మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందన్నారు.