ఆలయాలపై వరుస దాడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం అండదండలున్నాయని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 127 ఘటనలు జరిగితే ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. పైగా మంత్రులు ఎదురుదాడులు చేస్తూ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రామతీర్థం ఘటన, సోము వీర్రాజు అరెస్టుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కన్నా పాల్గొన్నారు.
రాష్ట్రంలో మత మార్పిడులు యథేచ్చగా సాగుతున్నాయని... వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని కన్నా ఆరోపించారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేవాలయాలపై దాడుల అంశాన్ని చూపించి.. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసలు రాష్ట్రంలో ఎక్కడ... ఏం అభివృద్ధి చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.