Kanna Lakshminarayana on jagan: రాయలసీమ ప్రాంత జగన్.. ఉత్తరాంధ్ర వరకు ఎలా పాదయాత్ర చేశారని ఇప్పుడు అమరావతి యాత్రను అడ్డుకుంటామని మాట్లాడించడం దారుణమని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతి యాత్రకు ఏం జరిగినా దానికి సీఎం బాధ్యత వహించాలన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ.. అమరావతి యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. పాదయాత్రకు భాజపా పూర్తి మద్దత్తు ఇస్తోందన్నారు. ఈ రాష్ట్రానికి అమరావతే రాజధానని తాము స్పష్టం చేశామన్నారు. కర్నూలులో హైకోర్టు ఉండాలని చెప్పినట్టు చెప్పారు.
భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ పోలవరం విషయంలో ఈ రాష్ట్రానికి చేతకాకపోతే తప్పుకుంటే తామే కడతామని కన్నా అన్నారు. భాజపా సిద్ధాంతం.. ఉత్తరాంధ్ర అభివృద్ధి గాని.. ఉత్తరాంధ్రను దోచుకోవడం కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మూడున్నరేళ్ల పాలనాలో ఏం అభివృద్ధి చేశారో వైకాపా ప్రభుత్వం చెప్పాలని అన్నారు. రాష్ట్రానికి ఇటువంటి సీఎం ఉండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
అమరావతి రాజధాని పూర్తి చేస్తామని అని చెప్పి.. మరి ఇప్పుడేం చేశారని కన్నా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం పూర్తి చేస్తామన్నారని... పోలవరం పూర్తి చేశారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం... ప్రజలు మోయలేని భారాన్ని వేస్తోందని 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారన్నారు. చివరికి చెత్తకు కూడా పన్ను వేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్మడం వల్ల... ఈ లిక్కర్ ధరలతో జనం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో శానిటైజర్ తాగి చనిపోయారన్నారు. ఇప్పటికి కల్తీ మద్యం తాగి చనిపోతున్నారని ధ్వజమెత్తారు. 2024లో మళ్లీ నరేంద్రమోదీ పాలనా వస్తేగాని.. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పారు. అప్పుడే డబల్ ఇంజిన్ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు.
రైతులను జగన్ మోసం చేశారు: రాష్ట్ర రాజధానికి నిధులు ఇస్తే చంద్రబాబు, జగన్ అమరావతిని నిర్మించకుండా రైతులను మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ తమ రాజధానులను కట్టుకున్నాయని... ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసిన పాపం జగన్‌కు తగులుతోందన్నారు. వైకాపా చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ నిర్వహించిన ప్రజాపోరు కార్యక్రమాన్ని మంగళగిరిలో సోము వీర్రాజు ప్రారంభించారు. చిరు వ్యాపారులతో ముచ్చటించారు. రాష్ట్రంలో ఎయిమ్స్ నిర్మాణానికి, పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే వాటిని జగన్ తన పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి