ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుమార్తెకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాజపా నాయకుడు భూమిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని సీఐడీ అధికారాలు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. ఆయన ఫేస్బుక్ ఖాతా నుంచి పలు పోస్టింగుల్లో ఇతరులకు పంపారని గుర్తించి.. తొలుత నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరారు.
దీనికి హాజరైన ఆయన్ను పోస్టింగ్లు మీ అంతటా మీరే పెట్టారా? లేక ఎవరైనా చెబితే పెట్టారా.. వారి పేర్లు ఏమిటి? ఎన్నాళ్ల నుంచి మీరు పేస్బుక్ ఖాతా నిర్వహిస్తున్నారని పలు ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం చరవాణి స్వాధీనం చేసుకొని రాజేంద్రప్రసాద్ రెడ్డిని విడిచిపెట్టారు. రాజేంద్రప్రసాద్ రెడ్డి గతంలో గుత్తేదారుగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఆయన వైకాపాను వీడి భాజపాలో చేరారు. ఆయన విచారణకు వచ్చారని తెలుసుకుని గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భాజపా నాయకులు మద్దతుగా సీఐడీ కార్యాలయానికి వచ్చారు.