గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెదేపా జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు రింగ్ రోడ్డు నుంచి అడవితక్కెళ్ళపాడులోని గృహసముదాయల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. దారి పొడువునా 'నా ఇల్లు - నా సొంతం' అంటూ నినాదాలు చేశారు. తక్షణమే లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గృహ సముదాయల ఎదుట కొంత సేపు బైఠాయించి నిరసన తెలిపారు. సహనం కోల్పోయిన లబ్ధిదారులు, తెదేపా నేతలు గృహాల్లోకి వెళ్లేందుకు యత్నించటంతో కొంతసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీసులను దాటుకుని కొంతమంది యువత గృహాల్లోకి వెళ్లారు. మరికొందరు భవనాలు ఎక్కి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్మించిన ఇళ్లను కేటాయించకుండా పేదలను రాష్ట్ర ప్రభుత్వం హింసిస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే లబ్ధిదారులను తామే ఇళ్లలోకి తీసుకెళతామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.