Cashew Industry in Problems: బాపట్ల జిల్లా వేటపాలెం అనగానే జీడిపప్పు గుర్తొస్తుంది. ఎటుచూసినా జీడిగింజలు ఒలుస్తూ కళకళలాడే దుకాణాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా జీడి పూత మాడిపోయింది. మార్చిలో రావాల్సిన పంట ఏప్రిల్‌లో చేతికి వచ్చింది. గతేడాది ప్రారంభంలో బస్తా జీడిగింజల ధర 8వేల4వందల రూపాయలు ఉండగా.. ప్రస్తుతం జీఎస్టీ, రవాణా ఖర్చుతో కలిపి 10వేల రూపాయలకు పైగా చేరిందని వ్యాపారులు వాపోతున్నారు.
జీడిపప్పు పరిశ్రమలకు ఈ ఏడాది కలిసొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ధరలు పెరిగాయి. విత్తనాల్లో నాణ్యత లేదు. దిగుబడి బాగా పడిపోయింది. నాణ్యమైన 100 కిలోల జీడిగింజల బస్తా నుంచి దాదాపు 28 కిలోల పప్పు వస్తుంటే.. ప్రస్తుతం 24 కిలోల వరకే వస్తోందని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు పెంచితే... వినియోగదారులపై అధిక భారం పడుతుందేమోననే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
"100కేజీలకు 28కేజీల జీడిపప్పు రావాలి. కానీ ఈ ఏడాది 24కేజీలే దిగుబడి వస్తుంది. దీంతో వ్యాపారులకు,తయారీ దారులకు ఇబ్బందిగా ఉంది. ధరలు కూడా బాగా పెరిగాయి." -వెంకటసుబ్బారావు, జీడిపప్పు వ్యాపారి.
" ప్రస్తుతం జీడిగింజల ధర మునుపెన్నడూ లేని విధంగా అధికంగా ఉంది. జీడి గింజల దిగుబడి కూడా చాలా పడిపోయింది. ప్రస్తుతం ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి. "-నాగ శ్రీనివాసరావు, అధ్యక్షుడు, జీడిపప్పు వ్యాపారుల అసోసియేషన్ .