పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గటంతో...దిగువకు నీటి విడుదలను అధికారులు నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి పులిచింతలకు 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు 5 గేట్లు ఎత్తి లక్షా 53వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజికి విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కులు కేటాయించారు. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.28 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
కృష్ణా నదిలో నిన్నటికంటే వరద తగ్గినా... ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ఇవాళ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో పంటలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయట పడుతున్నాయి. అయితే దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లిపొర, కొల్లూరు మండలాల పరిధిలో పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకూ పరిస్థితి ఇలాగే ఉంటే... అవి చేతికి వచ్చే అవకాశాలు తక్కువని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది.