ఆర్టీసీ ప్రయాణికులకు ఆన్లైన్ రిజర్వేషన్ తప్పనిసరి చేశారు అధికారులు. నగదు రహితంగా టికెట్లు ఇవ్వటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్‌పై అవగాహనలేక చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత విధానంలో టికెట్ల కోసం బస్స్టేషన్లలో విచారణ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మందికి అవగాహన లేనందున మరి కొంతకాలం పాత పద్ధతిలో టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రయాణికులు లేక బస్సులు బోసిపోతున్నాయి. ఒకరిద్దరు ప్రయాణికులతో బస్సులు నడుపుతున్నారు. గుంటూరు నుంచి మంగళగిరి, తెనాలి లాంటి ముఖ్యమైన దారుల్లోనూ కేవలం ఒకరిద్దరు ప్రయాణికులే ఉంటున్నారు. ఒక్కరి కోసం బస్సు నడపటంపై అధికారులు తొలుత సందేహించినా... సమయానికి వెళ్లాలి కాబట్టి, తిరిగి అక్కడి నుంచి బుకింగ్స్ ఉంటాయన్న ఆలోచనతో సమయానుకూలంగా నడపక తప్పని పరిస్థితి ఏర్పడింది.
12 డిపోల్లో 82 సర్వీసులు
గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మొత్తం 13 డిపోల్లో నరసరావుపేట మినహా మిగతా 12 డిపోల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గుంటూరు సహా పలు డిపోల నుంచి 82 బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి . కరోనా వ్యాప్తి వల్ల ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఆర్టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సులు మార్గమధ్యంలో ఎక్కడా ఆపకుండా.. డిపోల నుంచి డిపోలకు మాత్రమే సర్వీసులు నడుపుతున్నారు.