APSRMU Request to ISRO: తాము చేపట్టబోయే సరికొత్త పరిశోధన ప్రాజెక్టులకు అవసరమైన శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్‌ను ఏపీ ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య డి. నారాయణరావు కోరారు. బుధవారం గుంటూరు జిల్లా నీరుకొండలోని విశ్వవిద్యాలయంలో వారు భేటీ అయ్యారు. మెటల్ ఆడిటివ్ (3డి) మాన్యుఫాక్చరింగ్‌కు సాంకేతిక సాయంతోపాటు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో సెంటర్ ఫర్ ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్ ఏర్పాటుకు సహకరించాలని కోరినట్లు నారాయణరావు తెలిపారు.
ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం భాగస్వామ్యంతో చేపట్టే అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన సంక్లిష్ట విడిభాగాల అభివృద్ధికి ఈ కేంద్రం దోహదం చేస్తుందని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై ఇస్రో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వర్సిటీ ప్రొఫెసర్లు రంజిత్ థాపా, జీఎస్ వినోద్ కుమార్ ఈ భేటీలో పాల్గొన్నారు.