మహిళలకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గుంటూరు కలెక్టరేట్ లో మాట్లాడిన ఆయన.. మహిళలకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.18,750 చొప్పున రానున్న నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థికసాయం ప్రభుత్వం అందించనుందన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తుందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నాయని మంత్రి ఆరోపించారు. అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకుంటే స్థలాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు గుంటూరు జిల్లా అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని మంత్రి అభినందించారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. జిల్లాలో 7125 యాక్టివ్ కేసులుండగా, 3 వేల మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారన్నారు.
మహిళల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముప్ఫై లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హోంమంత్రి తెలిపారు.