సామాన్యుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలన్న హెచ్ఆర్సీ ఛైర్మన్ - ఏపీ తాజా వార్తలు
HRC Chairman సామాన్యుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి అన్నారు. వెనుకబడిన వర్గాల హక్కులను పరిరక్షించడం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
HRC Chairman న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులు వృత్తిలో ప్రవేశించిన తర్వాత వెనుకబడిన వర్గాల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా పని చేయాలని ఏపీ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి అన్నారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో న్యాయశాస్త్ర విద్యార్థుల రాష్ట్ర స్థాయి సమావేశం గుంటూరులోని జాగర్లమూడి చంద్రమౌళి(జేసీ) న్యాయ కళాశాల ఆవరణలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సీతారామమూర్తి మాట్లాడుతూ.. సెప్టెంబర్ చివరి వారంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మానవ హక్కుల ఆవశ్యకత, వాటి పరిరక్షణ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, కేఎల్‌యూ న్యాయ పాఠశాల ప్రిన్సిపల్ ఎన్.రంగయ్య, ఏఎన్‌యూ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ జయశ్రీ, జేకేసీ కళాశాల కార్యదర్శి జాగర్లమూడి మురళీమోహన్, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, జేసీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్.సుధాకర్‌బాబు పాల్గొన్నారు.