ప్రభుత్వం కొత్తగా మద్యం అమ్మకాలపైనా ఆడిట్ (Govt Audit on Wine Shops in AP) నిర్వహిస్తోంది. ఇప్పటివరకు పంచాయతీరాజ్, పట్టణ, స్థానిక సంస్థలు, సంక్షేమ వసతి గృహాల్లో లెక్కలపై ఆరా తీయగా.. తాజాగా మద్యం షాపులు ఆ కోవలోకి చేరాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో సొమ్మును కొందరు సిబ్బంది దారి మళ్లించిన ఘటనలు బయట పడటంతో ఆడిటింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖచ్చితమైన ఆదాయం ఎంత వస్తుంది? సిబ్బంది సరిగ్గానే జమ చేస్తున్నారా? అనే కోణంలో ఆడిటింగ్ చేపట్టనున్నారు.
మద్యం దుకాణాల నిర్వహణను ప్రభుత్వం చేపట్టిన తర్వాత మద్యం దుకాణాల్లో సిబ్బంది(Staff playing main role in wine shops) కీలకంగా మారారు. బ్రేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సరకు తేవడం, విక్రయాలు జరపడం, మళ్లీ తిరిగి డబ్బులు కట్టడం వంటి పనులన్నీ వారే నిర్వహిస్తున్నారు. అబ్కారీ శాఖను ఎక్సైజ్, సెబ్ పేరిట రెండు విభాగాలుగా మార్చడంతో మద్యం దుకాణాలపై పర్యవేక్షణ కొరవడింది. కొందరు సిబ్బంది ఇదే అదనుగా సొమ్మును పక్కదారి పట్టించారు.
రొంపిచర్ల, మాచవరం, మంగళగిరి వంటి చోట్ల పెద్దఎత్తున మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు చెల్లించలేదని గుర్తించారు. కొందరు బ్రెేవరేజేస్ కార్పొరేషన్ (Taking stock from Bravarages Corporation) నుంచి సరకును దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని బ్రాండ్లను బార్లు, రెస్టారెంట్లకు అనధికారికంగా విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం దుకాణాలపై ఆడిటింగ్ జరపడం ద్వారా ఖచ్చితమైన లెక్కలు, ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఆడిటింగ్ విధానానికి తెరలేపింది.