చేతబడి(Black magic) పేరుతో ఓ యువతిని, ఆమె కుటుంబసభ్యులను బెదిరిస్తున్న దంపతులను కృష్ణాజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామానికి చెందిన ఓ యువతి అనారోగ్యానికి గురి కావడంతో.. ఆమె తండ్రి తనకు తెలిసిన వినుకొండ సుబ్బరావుకు తెలియజేశాడు. తాంత్రిక పూజలు నిర్వహించే అతడు సదరు యువతికి ఎవరో చేతబడి(Black magic) చేశారని, దానిని తొలగించేందుకు పూజలు చేయాలన్నాడు.
అతడి మాటలు నమ్మిన యువతి అర్థనగ్నంగా పూజలో కూర్చోగా.. సుబ్బారావు దంపతులు ఆ తంతును వీడియో చిత్రికరించారు. అర్థనగ్నంగా ఉన్న యువతి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని దంపతులు బెదిరిస్తుండటంతో(Blackmail) బాధితులు గూడూరు పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలతో ప్రత్యేక బృందం.. గుంటూరు కేరళ కాలనీలో ఉన్న సుబ్బారావు, శివపార్వతి దంపతులను పట్టుకున్నారు. వారి నుంచి చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.