గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. నగరానికి 28 కి.మీ దూరంలో.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వైవాహిక యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో దారికాసి అటకాయించిన దుండగులు.. ఆలుమగలిద్దరినీ తీవ్రంగా కొటి,్ట చిత్రహింసల పాల్జేశారు. భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరవకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..
కర్ర అడ్డం పెట్టి.. కింద పడగొట్టి..
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు (భార్య 26, భర్త 30 ఏళ్లు) బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9.45 గంటలకు స్వస్థలానికి బయల్దేరారు. 2.50 కి.మీ దూరం ప్రయాణించాక.. దారికి అడ్డంగా వేసి ఉన్న ఓ చెట్టు కొమ్మ ఎదురుపడింది. దానిపై నుంచే వాహనాన్ని ముందుకు పోనివ్వగా.. దుండగులు కర్ర అడ్డంపెట్టి బైక్ పైనుంచి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే ఇద్దరిపై పిడిగుద్దులు కురిపించి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత కొడవళ్లు చూపించి చంపేస్తామని బెదిరించారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి అనుమానం రాకుండా బాధితుల బైకును పొలాల్లోకి దించేశారు. బాధితురాలి భర్త బనియను, దుస్తుల్ని చించేసి వాటితోనే అతన్ని కట్టేశారు. అతని వద్ద ఇద్దరు దుండగులు కాపలా కాయగా, మరో ఇద్దరు బాధితురాల్ని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి 12.40 గంటల వరకూ భార్యాభర్తలిద్దరినీ తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు.
నగలు దోపిడీ
అనంతరం నలుగురు దుండగులు బాధితురాలి మెడలోని మంగళసూత్రం, చెవిదుద్దులు, వెండి కాళ్లపట్టీలు, రూ.5 వేల నగదు దోచుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కొడవళ్లు చూపించి బెదిరించారు. ఎవరికీ చెప్పబోమని బాధితులు అన్న తర్వాతే విడిచిపెట్టి పరారయ్యారు. ఆ సమయంలో ఓ ఫోన్ నంబర్ కూడా బాధితులకు ఇచ్చారు. దాన్ని పరిశీలించగా, అది మధ్యప్రదేశ్‌కు చెందిన నంబర్‌గా తేలింది. ఆగంతుకుల్లో ముగ్గురు తెలుగులో మాట్లాడారని.. ఓ వ్యక్తి మాత్రమే వేరే భాషలో మాట్లాడినట్లు బాధితురాలు పోలీసులకు వివరించారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించినట్లు చెప్పారు. స్థానికులే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మేడికొండూరు మండలంలో ఈ తరహాలో రెండు, మూడు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నందున వీటి వెనుక ఏదైనా ముఠా ఉందా? ఇదీ దోపిడీ దొంగల పనేనా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
స్థానిక కూలీల విచారణ
ఘటనాస్థలికి అర కిలోమీటరు దూరంలో ఓ శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు ఇక్కడ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం ఘటనా స్థలానికి క్లూస్‌టీమ్ వెళ్లింది. వారితో తీసుకెళ్లిన జాగిలం ఈ శీతలీకరణ కేంద్రం వైపు వెళ్లి ఆగింది. పోలీసులు అక్కడ పనిచేస్తున్న 25 మంది కూలీల వేలిముద్రలు సేకరించారు. బాధితురాలిని గురువారం ఉదయం 8:15కు గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు పరీక్షించి కాన్పుల విభాగం వార్డుకు తరలించి పలు రకాల పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.