తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో మంగాయమ్మ - రాజారావు దంపతులున్నారు. వీరికి పిల్లలు లేరు. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరికి గుంటూరులోని అహల్య ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు. ఇప్పటికే వృద్ధ దంపతులైన వీరి ధైర్యాన్ని చూసిన వైద్యులు వెనక్కి తగ్గలేదు. వారి ఆశలకు వైద్యాన్ని జతచేశారు. పెళ్లైన 57ఏళ్ల తర్వాత మంగాయమ్మ.. కృత్రిమ విధానం ద్వారా గర్భం దాల్చేలా చేశారు.... డా.శనక్కాయల అరుణ ఉమా శంకర్. 73 ఏళ్ల మంగాయమ్మకు శస్త్రచికిత్స చేసి... ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశారు.
ఘనకీర్తీ...
సంతాన సాఫల్య పరిజ్ఞానంలో గుంటూరు వైద్యులు ఘనకీర్తి సాధించారు. 73 ళ్ల వయసున్న మహిళకు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు లేని లోటు తీర్చారు. ఇదంతా ఆధునిక వైద్య పరిజ్ఞానం గొప్పదనమని వైద్యులు చెబుతుంటే.... ఇది వైద్యుల ఘనతగా మంగాయమ్మ దంపతులు కొనియాడుతున్నారు. ఏది ఏమైనా ఇంత లేటు వయసులో తల్లి కావటం ద్వారా మంగాయమ్మ రికార్డు సృష్టిస్తే... ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు... అందుకు వేదికైన గుంటూరు నగరం కూడా వైద్యచరిత్ర పుటల్లో నిలిచింది.
వైద్యుల శ్రమ అంతాఇంతా కాదు...
మంగాయమ్మకు మాతృభాగ్యం కలిగించటంలో వైద్యుల శ్రమ అంతాఇంతా కాదు. ఆమె కృత్రిమ గర్భధారణ విధానం ఎంచుకున్నప్పటి నుంచి పిల్లలు పుట్టే వరకూ... ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. గతంలో వేరే చోట్ల ఐవీఎఫ్ విధానంలో ప్రయత్నించినా మంగాయమ్మ ఆశలు తీరలేదు. ఈ ఆసుపత్రిలో మాత్రం మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చారు. అప్పటినుంచి వైద్యులు మంగాయమ్మను కంటికి రెప్పలా కాపాడారు. అవసరమైన పోషకాహారం అందించారు.