గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 717 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 24వేల 675కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 217 ఉన్నాయి. ఇక జిల్లాలోని రొంపిచర్లలో 68, మాచర్ల 51, నర్సరావుపేట 49, తాడేపల్లి 43, దాచేపల్లి 31, తెనాలి 27, మంగళగిరి 26, పిడుగురాళ్ల 25, బాపట్ల 21, సత్తెనపల్లి 15, చిలకలూరిపేట11, అమరావతి, కొల్లిపొర, క్రోసూరు, మేడికొండూరు, తాడికొండలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 83 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కరోనా కారణంగా సోమవారం రోజున 9మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 242కు చేరుకుంది. కరోనా నుంచి జిల్లాలో 15వేల 340 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా మరణాలు పెరుగుతున్న తరుణంలో ప్లాస్మా థెరపీకి అధికారులు శ్రీకారం చుట్టారు. జీజీహెచ్, ఎన్.ఆర్.ఐ వైద్యశాలల్లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే 6మందికి ప్లాస్మా ఎక్కించినట్లు అధికారులు తెలిపారు. ప్లాస్మా సేకరణను జీజీహెచ్ తో పాటు జిల్లాలోని 9 ల్యాబ్ లలో అనుమతించినట్లు చెప్పారు.