వైఎస్సార్ హయాంలో రైతులను ఆదుకుంటే ఆయన తనయుడు జగన్ మాత్రం అన్నదాతలను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజధాని రైతులు ఆరోపించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 625వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రపంచంలో ఎవరైనా నదుల పక్కన రాజధానిని కోరుకుంటారని...ఈ ముఖ్యమంత్రి సముద్రం ఒడ్డుకు వెళ్తాననడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్క రావణాసురుడు తప్ప ఎవరూ సముద్రం పక్కన రాజధానిని నిర్మించుకోలేదని రైతులు అన్నారు. అందుకే అలాంటి మనస్తత్వం ఉన్న జగన్ సముద్రం పక్కకు వెళ్లాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అప్పటి సీఆర్డీఏ, ఇప్పటి ఏఎంఆర్డీఏ.. ప్రతి ఏడాది వార్షిక కౌలు అందిస్తుందని.. ఈ ఏడాదికి సంబంధించిన కౌలు సొమ్ము తనకు ఇంకా రాలేదని, దానిని ఎవరో దొంగిలించారంటూ తుళ్లూరు రైతు జమ్ముల అశోక్.. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌలు సొమ్ముపై సంబంధిత ఆధికారులను ఫోనులో అడగగా అందరికీ వార్షిక కౌలు సొమ్మును ఆయా బ్యాంకు ఖాతాల్లో వేశామని సంబంధిత అధికారులు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ఇదే సమాధానం చెబుతున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. తనకు కౌలు డబ్బులు బ్యాంకులో జమకాలేదని.. దీనిపై విచారణ చేసి డబ్బులు వచ్చేలా చూడాలని ఫిర్యాదులో కోరారు.