అధిక వడ్డీలకు పెట్టుబడులు తెచ్చి.. అహర్నిశలు శ్రమించిన మిరప రైతులకు... చివరికి నష్టాలు, కన్నీళ్లే మిగులుతున్నాయి. కాలం కలసి రాక దిగుబడి తగ్గగా.... చేతికి వచ్చిన పంటకు సైతం మార్కెట్‌లో సరైన ధర లేకపోవటంతో దిగాలు పడుతున్నారు. వచ్చిన కాడికి అమ్మినా...కూలీల ఖర్చులు కూడా రాని దుస్థితి. అయినా ఆశలు వదులుకోలేక ప్రకాశం జిల్లా అన్నదాతలు.....మిర్చి వేసి మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మార్కెట్లో మిర్చి ధరలు చూస్తే రైతు కంట కన్నీరు వస్తోంది. క్వింటా మిరప 14 వేల నుంచి 7 వేల రూపాయలకు పడిపోవడంతో ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నాగులప్పలపాడు, ఇంకొల్లు, పరుచూరు, కారంచేడు, మార్టూరు, అద్దంకి తదితర మండలాల్లో మిరప సాగు ఎక్కువ. గతేడాది ప్రారంభంలో మంచి ధర ఉన్నప్పటికీ...ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెగుళ్ల ప్రభావం దిగుబడి మీద పడింది. ఎకరాకు దిగుబడి 40 క్వింటాలు నుంచి 10 క్వింటాలకు పడిపోయింది.