పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కోర్టు న్యాయసేవాధికార సంస్థ భవనంలో వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఈ. భీమారావు మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా కోర్టు కేసులు త్వరితగతిన పూర్తవడం వల్ల కక్షిదారుల వ్యయప్రయాసలు తగ్గుతాయన్నారు. కక్షిదారులు భేషజాలకు పోకుండా రాజీ మార్గాన్ని అనుసరించడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. గతంలో కక్షిదారులు స్వయంగా కోర్టుకు వచ్చి తమ వాదలను తెలియజేసే వారిని, కరోనా కారణంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి వర్చువల్ లోక్ అదాలత్‌లను నిర్వహించి కేసులను విచారిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏవీ సుబ్బారావు , బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, డీఎస్ఎల్ఏ సెక్రెటరీ బాలకృష్ణ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ వి ఎన్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. దివాకర్, రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.